తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపత్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తమ తొలివిడత అభ్యర్థుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అభ్యర్థుల ప్రకటనతో పలు నియోజకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తి, అసమ్మతి కొనసాగుతూనే ఉంది. సిట్టింగులకు దక్కిన చోట ఇతర ఆశావహులు మార్చిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ అసమ్మతిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. తమకు టికెట్ కేటాయించాలని లేదా వేరే పార్టీకి వెళ్తామని తేల్చి చెప్తున్నారు. అభ్యర్థిని మార్చాల్సిందేనని లేకపోతే సహకరించేది లేదని వాపోతున్నారు. అధిష్ఠానం కనీసం పిలిచి మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ టికెట్ బండారి లక్ష్మారెడ్డికి ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి గళం విప్పారు. ఉద్యమం నుంచి పార్టీలో ఉన్న తనను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని.. ఇప్పటికైనా అధిష్ఠానం పిలిచి తనతో మాట్లాడతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరో నియోజక వర్గం పటాన్‌చెరులో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్న నీలం మధు ముదిరాజ్‌ను మంత్రి హరీష్‌రావు.. సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఇప్పటికైనా అభ్యర్థిని మార్చి తనకే టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌ను మధు కోరారు. ముదిరాజ్‌లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాలేరు టికెట్ సిట్టింగ్ శాసనసభ్యుడు ఉపేందర్ రెడ్డికే ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల బలప్రదర్శన చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావును పంపించి బుజ్జగించేందుకు ప్రయత్నించినప్పటికీ.. ససేమిరా అన్న తుమ్మల… ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావుకే టికెట్ దక్కడంతో.. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జలగం వెంకట్రావు, మధిరలో లింగాల కమలరాజ్‌కే మళ్లీ టికెట్ ఇవ్వడంపై సీనియర్ నేత బొమ్మెర రామ్మూర్తి అసంతృప్తితోనే ఉన్నారు.
అదేవిధంగా సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు వ్యతిరేకంగా సీనియర్ నేతలు చందర్‌రావు, శశిధర్ రెడ్డి అసమ్మతి బావుటా ఎగురవేశారు. మల్లయ్య యాదవ్‌ను మార్చాల్సిందేనని భీష్మించుకున్నారు. దేవరకొండలో రవీంద్రనాయక్ పై మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నరసింహా, మాజీ ఛైర్మన్ దేవేంద్ర నాయక్ వర్గీయులు భగ్గుమంటున్నారు. నాగార్జునసాగర్‌లో నోముల భగత్‌ను మార్చాలంటూ ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గానికి చెందిన పలువురు ఎంపీపీలు, జెట్పీటీసీలు, యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ రాజకీయాలు శాంతించడం లేదు. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి భగ్గుమంటోంది. స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరిని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అసంతృప్తితో రగిలి పోతున్నారు. మహబూబాబాద్ లో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను మార్చాలంటూ ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ములుగులో నాగజ్యోతికి టికెట్ ఇవ్వడంపై మాజీ మంత్రి చందులాల్ కుమారుడు ప్రహ్లాద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.