తెలంగాణలో మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాన్నారు మంత్రి హరీష్ రావు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్ధిదారులకు ఈనెల 16 నుండి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ ప్రారంభించబోతున్నామని తెలిపారు.అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ మేరకు మైనార్టీల వివిధ సమస్యలపై సచివాలయంలో మంగళ వారం చర్చ జరిగింది.
చర్చ అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్ సీస్ స్కాలర్ షిప్స్, స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజంల సంఖ్య పెంపు, క్రిస్టియన్ స్మశాన వాటికలు, RTF, MTF తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర వర్గాలతో సమానంగా మైనారిటీ వర్గాల సంక్షేమంతోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. స్మశాన వాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు-మౌజిన్‌ల సంఖ్య పెంపు వంటి రెండు హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే కేటాయించిన 270 కోట్లకు అదనంగా, మరో 130 కోట్లు కేటాయించి మొత్తం 400 కోట్లు ఈ కార్యక్రమం అమలుకు కేటాయించాలని ఆర్థిక శాఖను అదేశించటం జరిగిందని తెలిపారు.