దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ వేదికగా బ్రిక్స్ ఎకనామిక్ గ్రూప్‌లోని బిజినెస్ ఫోరం జరిగింది. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్ గైర్హాజరు అయ్యారు. ఆయన తరపున చైనా వాణిజ్య మంత్రి వాంగ్‌వెంటావ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధిపత్య ధోరణిపై ఆవేశపూరితంగా ఆయన ప్రసంగించారు.వాస్తవానికి సోమవారం జిన్‌పింగ్ జొహన్నెస్‌బర్గ్‌లో అడుగుపెట్టారు. ఆయన షెడ్యూల్ ప్రకారం మంగళవారం మిగిలిన నేతలతో కలిసి బిజినెస్‌ఫోరం మీటింగ్‌లో ప్రసంగించాల్సి ఉంది. కానీ, ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. దీనిపై చైనా నుంచి ముందస్తుగా ఎటువంటి సమాచారం లేదా వివరణ వెలువడలేదు. అదే సమయంలో అమెరికాను పరోక్షంగా తప్పుపడుతూ జిన్‌పింగ్ పంపిన ప్రకటనను చైనా వాణిజ్య మంత్రి చదివి వినిపించారు. తమకు తెలియకుండానే ప్రపంచ దేశాలు సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధంలో చిక్కుకోకూడదని పేర్కొన్నారు.
ఇందులో ఆయన నేరుగా ఎక్కడా అమెరికా పేరును ప్రస్తావించలేదు. ‘‘ఆధిపత్యం కనబర్చాలనే కొన్ని దేశాల ధోరణి అదుపు తప్పింది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలు, మార్కెట్లను దెబ్బతీస్తోంది. ఎవరైతే వేగంగా అభివృద్ధి చెందుతున్నారో.. వారిని అడ్డుకోవడమే లక్ష్యంగా మారుతుంది. కానీ, ఇదంతా వ్యర్థం’’ అని వెల్లడించారు. తాజాగా బిజినెస్ ఫోరం మీటింగ్‌కు హాజరుకాని బ్రిక్స్ నేత జిన్‌పింగ్ ఒక్కరే. చివరికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వర్చువల్ విధానంలో ప్రసంగించారు. చైనా విదేశీ వ్యవహారాలను సుదీర్ఘకాలంగా పరిశీలిస్తున్న వారు కూడా జిన్‌పింగ్ వ్యవహార శైలితో ఆశ్చర్యపోయారు. ‘‘చైనా చాలా ఆశలుపెట్టుకొన్న బ్రిక్స్ వంటి బహుళ పక్ష సదస్సు ప్రారంభ సమావేశంలో జిన్‌పింగ్ హాజరుకాకపోవడం చాలా అసాధరణ విషయం’’ అని విదేశీ వ్యవహారాల నిపుణులు ఒకరు పేర్కొన్నారు. ఏదో బలమైన కారణం ఉంటేనే జిన్‌పింగ్ గైర్హాజరై ఉంటారని చెబుతున్నారు.