దక్షిణ భారతదేశంలోని కేరళ పతనంతిట్ట జిల్లాలోని పెరియార్ టైగర్ రిజర్వ్ లోపల అభయారణ్యంలో కొలువై ఉన్న శబరిమల మణికంఠ స్వామి యాత్ర ఏటా దివ్య మనోహరంగా సాగుతుంది. పంబా నది తీరాన శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు తరలి వెళ్తుంటారు. నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో(మండలం-మకరవిళక్కు సీజన్) శబరిమల(Sabarimala Ayyappa Temple)కు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వంతో కలిసి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(Travancore Devaswom Board) ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
దాంతో ముందుగానే క్యూ/ప్రసాదాలు/పూజ/వసతి/కనిక్క వంటి సేవలను బుక్ చేసుకోవచ్చు. “ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్” ప్రాతిపదికన ఆన్లైన్లో యాత్రికులకు టికెట్లు జారీ చేస్తారు. ఈ క్రమంలో తాజాగా 2023 ఏడాదికి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. అయితే.. మీరు ఈ ఏడాది శబరిమల వెళ్లాలనుకుంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని ప్రశాంతంగా శబరిగిరీశుడిని దర్శించుకోండి. ఇంతకీ.. ఎప్పటి నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి?
ఈ ఏడాది మండలం-మకరవిళక్కు సీజన్లో శబరిమల వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. అయితే.. మంత్లీ పూజ(తులం) టికెట్లు అక్టోబర్ 17 నుంచి 22 వరకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే Sree Chithira Attathirunnal ఆన్లైన్ టికెట్లు నవంబర్ 10 నుంచి 11 వరకు, మండల పూజ మహోత్సవం టికెట్లు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 వరకు భక్తులు బుకింగ్ చేసుకోవచ్చు. శబరిమల వెళ్లే భక్తులు తాము దర్శించుకునే రోజు, సమయం వంటి వివరాలతో ఈ వర్చువల్ క్యూలైన్ బుకింగ్ చేసుకోవాలి. శబరిమల అధికారిక వెబ్‌సైట్ https://www.sabarimalaonline.org బుకింగ్ చేసుకోవాలి.