భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ఆరంభం కానుంది. పలు కారణాల వలన ప్రపంచకప్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆలస్యంగా ప్రకటించి.. టికెట్ల విక్రయాన్ని కూడా లేటుగానే మొదలు పెట్టింది. దాంతో ఎప్పుడెప్పుడు టికెట్లు అందుబాటులోకి వస్తాయా? అని ఎదురు చూసిన క్రికెట్ అభిమానులు.. ఒక్కసారిగా దండయాత్ర చేయడంతో యాప్‌లే క్రాష్ అయ్యాయి. దాంతో టికెట్స్ బుక్ చేసుకుందామనుకున్న అభిమానులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ప్రపంచకప్ 2023 టికెట్ల ఆన్‌లైన్ విక్రయం శుక్రవారం (ఆగష్టు 25) మొదలైంది. భారత్ మినహా మిగతా జట్ల వార్మప్ మ్యాచ్‌లతో సహా భారత్ మినహా ఇతర మ్యాచ్‌లకు సంబందించిన టికెట్లను విక్రయించారు. రాత్రి 8 గంటలకు టికెట్ల అమ్మకం షురూ అయింది. టికెట్ల కోసం కాచుకుని ఉన్న ఫాన్స్.. ఒక్కసారిగా దండయాత్ర చేయడంతో ‘బుక్ మై షో’ యాప్ సహా వెబ్‌సైట్ క్రాష్ అయింది. దాదాపు 40 నిమిషాల పాటు యాప్, వెబ్‌సైట్ పనిచేయలేదు. దీంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాసేపటికి బుక్ మై షో రన్ అవ్వడంతో ఫాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు.
‘ప్రపంచకప్ 2023లో భారత్ మినహా మిగతా మ్యాచ్‌ల టికెట్ల విక్రయం శుక్రవారం రాత్రి 8 గంటలకు మొదలైంది. ఇప్పుడు సమయం 8:08. బుక్ మై షో యాప్ క్రాష్ అయింది. ఇప్పుడే ఇలా ఉంటే.. మరి భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆగష్టు 30 నుంచి భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్లు అమ్మకానికి రానున్నాయి. మెగా మ్యాచ్ భారత్, పాకిస్తాన్ టికెట్ల విక్రయం సెప్టెంబర్ 3న ఉంది.