డయాగ్నొస్టిక్ సెంటర్లకో, ఆస్పత్రులకో పరుగులు తీయకుండా ఎంచక్కా ఇంటి దగ్గరే ఆరోగ్య పరీక్షలు సొంతంగా చేసుకునే సౌలభ్యం ఉంటే? అది సాకారమయ్యే రోజు వచ్చేసింది. మన శరీరాన్ని జల్లెడ పట్టి రిపోర్టులు ఇచ్చే ‘బాడీ స్కాన్ స్కేల్’ నవంబరులో అందుబాటులోకి రానుంది. ఆరోగ్య పరికరాల ఉత్పత్తి సంస్థ విథింగ్స్ దీనికి రూపకల్పన చేసింది. ఫ్రాన్స్ కు చెందిన ఈ కంపెనీ.. స్మార్ట్ స్కేల్స్ తయారీలో అగ్రస్థానంలో ఉంది. బాడీ స్కాన్ తరహాలోనే 2009లోనే ఓ స్మార్ట్ పరికరాన్ని విథింగ్స్ తీసుకొచ్చింది.
ఏ ఏ పరీక్షలు సాధ్యం..?
బరువు, కండరాల బలం, శరీరంలో నీటిశాతం, కొవ్వు, ఎముకల దృఢత్వం, బీఎంఐ, ఉదరంలోని అవయవాల చుట్టూ ఏర్పడే కొవ్వును లెక్కిస్తుంది. గుండె, గుండె కండరాల పనితీరు, నిలబడినప్పుడు గుండెవేగం ఎంతో చూపిస్తుంది. నాడీవ్యవస్థ(కాళ్లలో), రక్తనాళాల పనితీరును తెలుసుకోవచ్చు.
ఇదీ ‘బాడీస్కాన్’..
మనం ఇంట్లో బరువు చూసుకునే యంత్రంలాగానే ఉంటుంది. అదనంగా దీనికి పై భాగంలో సాగే హ్యాండిల్ ఉంటుంది. దానిని లాగి పట్టుకుని నిలబడితే బాడీ స్కాన్ అవుతుంది. ఇందుకోసం హ్యాండిల్‌లో రెండు ఎలక్ట్రోడులు, బాడీ భాగంలో మరో రెండు ఎలక్ట్రోడులు, బరువును లెక్కించేందుకు నాలుగు సెన్సర్లు, 14 ఐటీపీ ఎలక్ట్రోడులు ఉంటాయి. ప్లాట్ ఫామ్‌ను టెంపర్డ్ గ్లాస్‌తో తయారు చేశారు. 3.2 అంగుళాల ఎల్సీడీ రంగుల స్క్రీన్‌పై రీడింగ్స్ ను చూసుకోవచ్చు. వైఫై కనెక్టివిటీ సదుపాయం కూడా ఇచ్చారు. ప్రారంభ ధర రూ.25 వేల వరకు ఉంటుంది. 2023 జనవరి నుంచి మార్కెట్‌లోకి విస్తృతంగా అందుబాటులోకి వస్తుంది.