కేంద్ర క్యాబినెట్(Central Cabinet) లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై తెలంగాణ బీజేపీ రాజ్యసభ్య సభ్యులు లక్ష్మణ్(Laxman is a member of Rajya Sabha from BJP) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ తెచ్చిన మహిళ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని.. మహిళాల అభ్యున్నతికి మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. బిల్లును వ్యతిరేకించేవారు రానున్న రోజుల్లో రాజకీయంగా పుట్టగతులు ఉండవు అని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన మహిళ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటు వెయ్యాలి అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండదు అంటూ ఆయన పేర్కొన్నారు.
మహిళ రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసే బీఆర్ఎస్(BRS) మహిళల కోసం ఎన్ని సీట్లను కేటాయించిందో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్(CM KCR) మొదటి క్యాబినెట్ లో కనీసం ఒక్క మహిళ మంత్రి కూడా లేదు.. మీరు మహిళా బిల్లు మా పోరాటం వల్లే వచ్చిందంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో యూపీఏ హయాంలో బిల్లును ప్రవేశ పెట్టినప్పటికి దాని మిత్ర పక్షాలే ఈ బిల్లును అడ్డుకున్నాయి. రాజ్యసభలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే మాటలు కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటో నిరూపిస్తుంది అని లక్ష్మణ్ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్(Central Cabinet) ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందని.. ఈ డిమాండ్‌ను నెరవేర్చే ధైర్యం మోదీ ప్రభుత్వానికే ఉందని చెప్పారు. ఈ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం వల్ల ఇది రుజువైందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ భేటీలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, జైశంకర్, పీయూష్ గోయల్, గడ్కరీ, తోమర్, పాల్గొన్నారు. అయితే కేబినెట్ సమావేశానికంటే ముందు పలువురు మంత్రులు కీలక భేటీలు నిర్వహించారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal), పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నట్లు సమాచారం. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు జమిలి ఎన్నికలు, దేశం పేరును మార్చే బిల్లును కూడా తీసుకువస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇక ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిడివి తక్కువే అయినప్పటికీ.. జరుగుతున్న సందర్భం చాలా గొప్పదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.