హన్మకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలు శంఖుస్థాపన చేయడానికి వచ్చిన ప్రధాని కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేసారు. రైల్వే ఫ్యాక్టరీ ద్వారా 3 వేల ఉద్యోగాలు వస్తాయని బహిష్కరిస్తున్నారా? రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినందుకు బహిష్కరిస్తున్నారా? ఆయన అడిగాడు. ఈ రాష్ట్రంలో ముందుగా కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి.. హామీలను తుంగలో తొక్కిన కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలని మండిపడ్డారు. అంతేకాకుండా.. ఉచిత ఎరువులు ఇవ్వనందుకు తెలంగాణ రైతులు కేసీఆర్‌ను బహిష్కరిస్తారు. రుణమాఫీ చేయనందుకు రైతులు కేసీఆర్‌ను బహిష్కరిస్తారు. కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేసే రోజు ఎంతోదూరంలో లేదని అన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీలు ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పొత్తు చరిత్ర ఉంది. బీఆర్‌ఎస్‌తో బీజేపీ ఎప్పటికీ కలవదని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుటుంబ, అవినీతి పార్టీలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డీఎన్‌ఏ ఒక్కటే.. వాటికి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటేస్తే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అన్నారు. కాంగ్రెస్ , బీఆర్ ఎస్ కలిసి ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అమలు కావని అన్నారు. ప్రపంచ ప్రజాదరణ పొందిన నాయకుడు మోడీ అని తెలిపారు. 9 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని నాయకుడు మోడీ. 30 ఏళ్ల తర్వాత ఓరుగల్లుకు ప్రధాని మోడీ వచ్చారు. వర్షం కురుస్తున్నప్పటికీ గ్రామాల నుంచి సభకు జనం తరలివచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్రం ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు రూ.లక్షా పదివేల కోట్ల ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సభలో ఈటల రాజేంద్ర మాట్లాడుతూ.. వరంగల్ గడ్డమీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టిన ఇవాళ.. తెలంగాణ జిల్లాలకు శుభసూచికమని అన్నారు. తెలంగాణకు భరోసాగా ఉన్నామని చెప్పేందుకే ప్రధాని వచ్చారన్నారు. ‘‘ కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారు. హామీలు ఇచ్చి ప్రజల కళ్లలో మట్టికొట్టిన కేసీఆర్‌ను ఓడించాలి. బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ మాటలు చెప్పారు. బంగారు తెలంగాణ చేతల్లో చేసి చూపించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఈటల తెలిపారు.
ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత ప్రధాని నరేంద్ర మోదీ’ అని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ‘‘ ప్రపంచ దేశాలే పాదాభివందనం చేసే నేత మోదీ. రూ.6 వేలకోట్ల పనులు ప్రారంభించిన మోదీకి కరీంనగర్ ప్రజల తరఫున ధన్యవాదాలు. ఏం ముఖం పెట్టుకొని ప్రధాని మోదీ వస్తారని కొందరు ప్రశ్నించారు. 10 వేల మంది వరకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని మోదీ వచ్చారు. వరంగల్‌ను స్మార్ట్ సిటీ చేసేందుకు మోదీ వచ్చారు. ప్రధాని కార్యక్రమానికి వచ్చేందుకు కేసీఆర్‌కు ముఖం లేదు. మోదీ వస్తే కేసీఆర్‌కు కొవిడ్ వస్తుంది.. జ్వరం వస్తుంది’’ అని బండి సంజయ్ విమర్శించారు. పార్టీ తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సహా అనేక అవకాశాలు కల్పించిందని ఆయన అన్నారు.