2024 లోక్ సభ ఎన్నికలు, ఈ ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి సమాలోచన చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తక్కువ ఓట్లతో ఓడిపోయిన 160 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేయడంపై చర్చించారు. బీజేపీ రూపొందించిన “లోక్ సభ ప్రవాస్” కార్యక్రమంతో సంబంధమున్న ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు జరిగే ఈ ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలవాలని అనుకుంటోంది. ముఖ్యంగా ఇప్పటికే అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని నిలుపుకోవడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోని రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో గెలవాలని బీజేపీ భావిస్తోంది. ఇక తెలంగాణలో సత్తా చాటాలని అనుకుంటోంది. కర్ణాటక ఎన్నికల పరాజయం తర్వాత ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవద్దని కృతనిశ్చయంతో బీజేపీ ఉంది.
అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి, పూర్తి సామర్ధ్యం తో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించే విజయం ద్వారా రానున్న సార్వత్రిక లోకసభ ఎన్నికలను ప్రభావితం చేయాలన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల ముందు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే చాలా కీలకమని ప్రస్తుతం బీజేపీ భావిస్తోంది. తాజాగా ఈ రోజు జరిగిన సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక సభ్యులు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.