గిరిజనులు అభివృద్ధి చెందకుండా అడవిలోనే జీవించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదీవాసీలు దేశానికి యజమానులని తాము నమ్ముతున్నామని.. భూమిపై వారికి హక్కుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదీవాసీల నుండి భూములను లాక్కొని అదానీకి అప్పగిస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గుర్తు చేశారు. తాము హక్కులు కల్పిస్తే బీజేపీ వాటిని రద్దు చేసిందని రాహుల్ విమర్శించారు. గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజస్థాన్ రాష్ట్రంలోని మాన్‌గర్ థామ్ లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పుణ్యభూమికి అందరికి స్వాగతం అంటూ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మాన్‌గర్‌ధామ్ లో బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు అర్పించిన గిరిజన సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తన నానమ్మ ఇందిరా గాంధీ బాల్యంలో తనకు ఇచ్చిన పుస్తకం గురించి రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.ఈ పుస్తకం తనకు ఎంతో నచ్చిన పుస్తకంగా ఆయన పేర్కొన్నారు. తాను మీ సైనికుడినని.. ఢిల్లీలో ఉంటానని రాహుల్ చెప్పారు. మీరు ఎప్పుడైనా రాజస్థాన్ కు పిలవొచ్చని రాహుల్ గాంధీ గిరిజనులను కోరారు.
ఆధునిక సమాజం గిరిజనుల జీవితం నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. భారతదేశం పూర్వం ఆదివాసీల భూమి అని గుర్తు చేశారు. గిరిజనుల పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నారో అది నిజం కావాలని తాము భావిస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. గిరిజనులు అడవిలోనే ఉండాలని మీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావొద్దని బీజేపీ కోరుకుంటుందని విమర్శించారు. మణిపూర్ లో బీజేపీ భరతమాతను హత్యచేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. సైన్యాన్ని దింపి గొడవలను నివారించే అవకాశం ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ఆ పని చేయడం లేదని మండిపడ్డారు. మణిపూర్‌లో ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ ప్రశ్నించారు. తాను పార్లమెంట్ లో కూడ ఇదే విషయాన్ని ప్రస్తావించానని చెప్పారు. పేద ప్రజల కోసం రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని.. కేవలం పెన్షన్ పథకం ద్వారానే 90 లక్షల మందికి పైగా లబ్ది పొందుతున్నారని రాహుల్ గాంధీ తెలిపారు.