అడవులు తగ్గిపోవడం వలన జంతువులు జనావాసాల మీద పడుతాయి. ఇలాంటి ఘటనలు మనం రోజు చూస్తుంటాం. తాజాగా అలాంటి ఓ సంఘటనే విశాఖ నగర శివారు ప్రాంతమైన ఎండాడలో జరిగింది. ఎండాడలోని ఎంకే గోల్డ్ వద్ద చిరుత కనిపించటం స్థానికంగా ఉండే ప్రజల్లో కలకలం రేపింది. ఎంకే గోల్డ్‌కి సమీపంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు.. తాను భోజనం చేసే సమయంలో ఆ పక్కన ఉన్న కొండ మీద నుంచి ఓ జంతువు రావడం గమనించానని తెలిపాడు. మొదట తాను ఆ జంతువు కుక్క అని అనుకున్నానని అతను పేర్కొన్నాడు. కానీ దగ్గరికి సమీపిస్తున్న కొద్ది అది చిరుతపులి అని తెలుసుకుని భయాందోళనకు గురైనట్లు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన ఆ సెక్యూరిటీ గార్డు.. చిరుతపులిని చూసిన విషయం గురించి స్థానికులకు తెలియజేశాడు. చిరుత సంచారంపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత పులి కోసం అటవీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.
తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల చిరుత బోనులో చిక్కిన ఘటన మరువరక ముందే తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఎలిపేంట్ ఆర్చీ వద్ద మరో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. శ్రీవారి మెట్ల మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమరాలో చిరుత సంచారం గుర్తించిన అధికారులు భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. తిరుమల స్పెషల్ కాటేజీల సమీపంలో ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు మరో ట్రాప్ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో, ఆ సమీప ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే రెండు చిరుతలు చిక్కాయి.. నాలుగు రోజుల క్రితం ఓ చిరుత బోనులో చిక్కిన విషయం విదితమే కాగా.. మరో చిరుతను నిన్న అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందిన విషయం తెలిసిందే.
దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. నడక మార్గంలో వెళ్లేందుకు భయంతో వణికిపోతున్నారు. అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. అటవీశాఖ అధికారుల సహాయంతో ఆపరేషన్ చిరుత పేరుతో చిరుతలను బంధించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.. దాని కోసం చిరుతల సంచారాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే కాగా.. ఆ కెమెరాల్లో చిరుతల సంచారానికి సంబంధించిన దృశ్యాలు చిక్కుతున్నాయి. ఆపరేషన్ చిరుతలో భాగంగా అలిపిరి- తిరుమల మార్గంలోని శేషాచలం అటవీప్రాంతంలోని నడకమార్గంలో మరో ఆరు నూతన బోన్లను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటుచేశారు. మహారాష్ట్ర నుంచి తెప్పించిన వీటిని చిరుతలు సంచరించే ప్రాంతాల్లో ఉంచారు. చిరుతలు, ఎలుగుబంట్లను పట్టుకుని భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు ముమ్మరం చేశారు.