హీరో నవదీప్ (Actor Navdeep)కు మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని నార్కోటిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు.. నవదీప్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. నార్కోటిక్ విభాగం పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన.. డ్రగ్స్ సరఫరా చేసే రాంచందర్‌తో నవదీప్(Actor Navdeep Drugs case)కు సంబంధాలున్నాయని.. దాని తాలుకు వాట్సాప్ చాటింగ్ ఆధారాలు సేకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సంబంధిత వాట్సాప్ చాటింగ్ ఆధారాలను హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో పొందుపరిచారు. గతంలోనూ నవదీప్‌పై డ్రగ్స్ కేసులున్నాయని తెలిపారు.
మరోవైపు మాదాపూర్ డ్రగ్స్ కేసుతో నవదీప్(Actor Navdeep)కు ఎటువంటి సంబంధం లేదని, గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా లేడని నవదీప్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువురి వాదనలను విన్న కోర్టు 41ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని నార్కోటిక్ పోలీసులను ఆదేశించింది. నవదీప్‌కు 41ఏ నోటీసులు జారీ చేసి.. అతనిని పిలిచి ప్రశ్నించనున్నారు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన నార్కోటిక్ విభాగం పోలీసులు.. నవదీప్ ను ప్రశ్నించి అతని నుంచి కీలక సమాచారం సేకరించాలని భావిస్తున్నారు.
మరోవైపు మాదాపూర్(Madapur) డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పట్టుబడ్డ నిందితులు మత్తుదందాలను అడ్డుపెట్టుకుని.. చిత్రనిర్మాతలుగా అవతారం ఎత్తారని పోలీసుల విచారణలో వెల్లడైంది. నైజీరియన్ల నుంచి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి, రేవ్ పార్టీల వంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారని నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. వీటికి సినీ, రాజకీయ మిత్రులను ఆహ్వానించి.. వారితో పరిచయాలు పెంచుకుంటున్నారని తెలిపారు. నిందితులు కల్హర్‌రెడ్డి, బాలాజీ, రాంకిశోర్ సెల్‌ఫోన్ల డేటాలో పలువురు సినీ రంగ ప్రముఖుల ఫోన్ నంబర్లను పోలీసులు గుర్తించినట్లు సమాచారం.