తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతోపాటు, సాక్ష్యాలు ధ్వంసం చేయడంలోనూ వైఎస్ భాస్కరరెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. హత్య కేసులో సీబీఐ కోర్టు బెయిలును తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి.. దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. నిందితులు పలుకుబడి ఉన్నవారు కావడంతో సాక్షులను ప్రభావితం చేయగలరని.. బెయిలు మంజూరు చేయొద్దని సీబీఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. గతంలో దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, ఇప్పుడు బెయిలిస్తే విచారణను సాఫీగా సాగనివ్వరని తెలిపింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు. మరోవైపు హత్య కేసులో దర్యాప్తు పూర్తయి అభియోగపత్రం దాఖలు చేసిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేసి.. తీర్పును ఈ నెల 29కి వాయిదా వేసింది.
వివేకా హత్యకేసులో నిందితులైన మరో ఇద్దరు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. వీరి బెయిల్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. వైఎస్ వివేకా హత్యకేసులో అసలు నిందితులెవరో ఇంతవరకూ సీబీఐ(CBI) తేల్చలేకపోయింది. ఎవరి నుంచి ఫోన్ వస్తే.. ఎవరు ఆయన్ను చంపారన్నది ఇప్పటికీ మిస్టరీనే. వివేకాను ఆస్తి కోసం చంపారా ? లేక రాజకీయ హత్య? ఇందులో మరేదైనా కుట్రదాగుందా ? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో ఎంపీ అవినాషే అసలైన నిందితుడని రెండునెలల క్రితం జోరుగా ప్రచారం జరిగింది.
ఇక సీబీఐ అతడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరచడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో.. తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ విచారణ సందర్భంలోనే.. సీబీఐ ఈ కేసులో ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ కు కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపించింది. ఈ వాదనలను తెలంగాణ హైకోర్టు కొట్టిపారేసింది. అందుకు తగిన సాక్ష్యాలు లేకుండా.. మొదటి నుంచి లేని వ్యక్తి పేరును ఇప్పుడు ఛార్జిషీటులో చేర్చడం ఏంటని మొట్టికాయలు వేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ విషయంలో కూడా హైకోర్టు పట్టువీడటం లేదు. ఆయన బెయిల్ పై బయటికెళ్తే.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు భాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది. మరి ఈ సారి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.