చుట్టూ దట్టమైన అడవులు.. ఎగసిపడే జలధారలతో నిండిన జలపాతాలు.. పుష్కలంగా వన్యప్రాణులతో నిండిన నిర్మలమైన నదీ పరీవాహక ప్రదేశాలు.. అలాంటి పర్యాటక సాహస నేల దండేలి. ఇక్కడ వేసే ప్రతి అడుగులోనూ ప్రకృతితో మాట్లాడవచ్చు.. ప్రకృతిని పలకరించవచ్చు.. మొత్తంగా ప్రకృతిలో మమేకమవ్వొచ్చు. అప్పట్లో మైసూర్ మహారాజులకు దండేలి వేట విడిదిగా ఉండేదట. అరుదైన జంతుజాలాలతో, దట్టమైన పచ్చని ప్రకృతి అందాలతో పర్యాటకులు మెచ్చే దండేలి విశేషాలు..
దండేలిలో వన్య ప్రాణుల అభయారణ్యం ప్రసిద్ధి చెందినది. ఇది కర్ణాటకలో రెండవ పెద్ద వన్య ప్రాణుల అభయారణ్యం. 2007 లో టైగర్ రిజర్వ్ జోన్‌గా ప్రకటించబడింది. ఈ అభయారణ్యం చుట్టూ కావేరి నది ప్రవాహాలు, కాళీ నది, దాని ఉపనదులు ప్రవహిస్తుంటాయి. అభయారణ్యం చేరిన తర్వాత పర్యాటకులు అక్కడి దృశ్యాలను, రివర్ వ్యాలీ లను, కొండ చరియలు చూడవచ్చు. 200 రకాల పక్షులకు, 300 కు పైగా జంతువు జాతులకు ఈ అభయారణ్యం నిలయంగా ఉన్నది. పులి, జింకలు, గుంట నక్కలు, ఏనుగులు, దుప్పులు మొదలైన వాటితో పాటు అరుదైన పక్షులను చూడవచ్చు. పర్యాటకులు టాప్ లెస్ జీప్ లో ప్రయాణించి గైడ్ ద్వారా వాటి వివరాలను అడిగి తెలుసుకోవచ్చు.
కాళీ నది జలాల గుండా ప్రయాణించడానికి కయాకింగ్ మంచి ఎంపిక. అలా గ్లైడ్ చేస్తున్నప్పుడు అక్కడి అడవుల సుందరమైన దృశ్యాలను దగ్గరగా చూడవచ్చు. అంతేకాదు, రిజర్వాయర్‌లో జలాలు కలిసే ప్రదేశానికి కూడా వెళ్లవచ్చు. ఇక్కడ నుండి, చుట్టుపక్కల ఉన్న ద్వీపాలలో దాగిన పక్షుల కిలకిలారావాలు మనసారా ఆస్వాదించేందుకు ఈ నదిలో కయాకింగ్ ఎంతో సహకరిస్తుంది. కాళీ నది లో పర్యాటకులు బోటింగ్, పడవ ప్రయాణం చేయవచ్చు. ఇక్కడ అనేక పక్షులు కనిపిస్తుంటాయి. చెకుముకి పిట్టలు, మైనా, కోకిల, చిలుక ఇలా ఎన్నో గమనించవచ్చు. నది పై గల వంతెన నుండి పర్యాటకులు సదాశివ ఘడ్ ఫోర్ట్ ను చూడవచ్చు.
శిరోలి పీక్ దండేలి నుండి 25 కిలోమీటర్ల దూరంలో కలదు. శిరోలి శిఖరాన్ని చేరిన పర్యాటకులు అక్కడి నుండి సహ్యాద్రి పర్వతాలను చూడవచ్చు. శిరోలి పీక్ ఉత్తర కన్నడ ప్రాంతంలో ఉన్నత శిఖరం కావటం వలన ట్రెక్కర్లు బాగా ఇష్టపడతారు . ఈ శిఖరం నుండి సూర్యాస్తమయం చూసి ఆనందిస్తారు. దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ మరియు పడమటి కనుమలు కూడా కనపడతాయి. పర్యాటకులు అటవీ శాఖ అనుమతులతో ఈ ప్రాంతం ప్రవేశించవచ్చు. వింధ్య పర్వతాలకు దక్షిణంగా తెల్లటి వాటర్ రాఫ్టింగ్‌కు ఉత్తమమైన ప్రదేశాలలో ఇదీ ఒకటి. ఉధృతంగా ప్రవహించే కాళీ నది కెరటాలపై సాగే ఈ సాహసయాత్రకు ఆసక్తితోపాటు ధైర్యం కూడా అవసరమే.
కుల్గి నేచర్ క్యాంప్ దండేలి బస్ స్టాండ్ కు 12 కిలోమీటర్ల దూరంలో కలదు. నేచర్ క్యాంపు లో వసతి కై గుడారాలు ఉంటాయి. ఒక్కో గుడారానికి ఒక్కో పక్షి పేరు పెట్టారు. ఇక్కడ కాళీ అడ్వెంచర్ రిసార్ట్, బిసన్ రివర్ రిసార్ట్, దండేలి జుంగల్ క్యాంపు, ఓం ఫారెస్ట్ క్యాంపు వసతికి అందుబాటులో ఉంటాయి.