భారత్ దేశంలో ఎన్నో వింత ప్రదేశాలున్నాయి. వాటిలో ఒక్కటి గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్. భౌగోళిక వైవిధ్యం కల గుజరాత్ రాష్ట్రంలో కచ్ లోని ఉప్పు కయ్యలు, బీచ్ లు మరియు గిర్నార్, సపూతర ప్రదేశాలలోని పర్వత శ్రేణులు పర్యాటకులకు పూర్తి గా ఆహ్లదకరమైన వాతావరణంలోకి మార్చేస్తాయి. అంతేగాక ఏడాదికోసారి మూడు నెలలు పాటు జరిగే రాన్ ఉత్సవ్ పర్యాటకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ విశేషాలను మీరు తెలుసుకోండి
భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఉండే ఈ ప్రాంతం.. ఎక్కువ భాగం ఇండియాలోనే ఉంది. ఇది పూర్తిగా ఉప్పుతో నిండి ఉంటుంది. రాన్ అంటే.. ఉప్పుతో కూడిన చిత్తడి నేల అని అర్ధం. కచ్ అనేది సంస్కృత పదం. దాని అర్థం తిరగబడిన తాబేలు అని. రాన్ ఆఫ్ కచ్ మ్యాప్ చూస్తే… నిజంగానే తాబేలు తిరగబడినట్లు కనిపిస్తుంది. అందుకే ఆ పేరు పెట్టారు.
తూర్పు, పడమర అంతటా మొత్తం 26,000చదరపు కిలోమీటర్లలో ఉప్పు నేల ఉంటుంది. ఉత్తరాన థార్ ఎడారి తగులుతుంది. దక్షిణాన పర్వతాలుంటాయి. పశ్చిమాన సింధు నది డెల్టా కూడా ఉంటుంది. మొత్తంగా ఇండియాతో సంబంధం లేని ప్రాంతానికి వెళ్లినట్లు అనిపించడం సహజం. ఈ ప్రదేశం ఎటు నుంచి చూసినా తెల్లని ఎడారిలా కనిపిస్తుంది. చెట్టు చేమలు ఉండవు. దూరంగా చూస్తే.. భూమి, ఆకాశం కలిసిపోయినట్లు కనిపిస్తాయి. కానీ, రాత్రివేళ ఇది వెండి చందమామలా మెరుస్తుంది. జాబిల్లి నుంచి వచ్చే కాంతి.. ఈ ఉప్పు ప్రపంచంపై పడి.. తిరిగి ప్రసరిస్తూ కాంతివంతంగా కనిపిస్తుంది.
విస్తారమైన తెల్లటి ఎడారిలో సూర్యాస్తమయాలు కళ్లను మిరుమిట్లు గొలుపుతుంటాయి. తదేకంగా చూస్తే కళ్లు చెదురుతాయి కూడా. నిండు పున్నమి వెన్నెలలో చల్లని వాతవరణంలో ఉప్పుటెడారిలోని గుడారాల్లో నైట్ స్టే పర్యాటకులకు మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. మన భారత దేశంలోనే అతి పెద్ద జిల్లా గుజరాత్‌లోని కచ్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కుట్లు, అల్లికల్లో కళ్ళు చెదిరే నైపుణ్యం అక్కడ మహిళల సొంతం. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కచ్ వర్క్ దుస్తులు కొనాల్సిందే. కేవలం ఆడవాల్లే కాదు, సృజనాత్మకతలో మగవాళ్లు కూడా మేమేం తక్కువ కాదు అంటారు, కలపతో కళాత్మక వస్తువుల అలవోకగా తయారుచేస్తారు. రాన్ ఆఫ్ కచ్ కి వెళ్లాలనుకునే వారికి వర్షకాలం తరువాత అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనువైన సమయం.