ఒక కప్పు కుంకుమపువ్వుతో చేసిన టీ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది ఒత్తిడి, అలసటకు వీడ్కోలు చెప్పడమే కాకుండా మీ శరీరాన్ని అనేక వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది అంటున్నారు. అసలు దీనిని ఎలా తయారు చేయాలి? దీనిని సేవించడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శారీరకంగా అలసిపోయినా.. మానసికంగా కృంగిపోయినా చాలా మంది రిఫ్రెష్ కోసం టీ తాగుతారు. అయితే నార్మల్ టీకి బదులుగా కుంకుమపువ్వు టీ తాగితే మనసుకు హాయిగా ఉండడమే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి అంటున్నారు. సుగంధ రుచితో కూడిన ఈ టీని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తీసుకుంటే అది మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. దీంతో మీ రోజును రిలాక్స్‌గా ప్రారంభించవచ్చు.. లేదా ముగించవచ్చు.
ఈ సుగంధభరిత టీని కుంకుమ పువ్వులతో తయారు చేస్తారు. ఇది టీకి గొప్ప రంగు, రుచిని అందిస్తాయి. అయితే దీనిలో మీరు అల్లం, దాల్చిన చెక్క మీ ఇష్టానికి తగినట్లు వేసుకోవచ్చు. ఇవి టీ రుచిని మరింత పెంచుతాయి. కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, శ్లేష్మం, విటమిన్లు B1, B2 మరియు ఇతర వర్ణద్రవ్యాలు దీనిలో మెండుగా ఉంటాయి. తేలికగా తయారు చేసుకోగలిగే ఈ టీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమపువ్వు ఓ సాంప్రదాయ ఔషధం. నెలసరి రోజుల్లో దీనిని తీసుకోవడం వల్ల ఋతుస్రావంలో కలిగే తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇదే కాకుండా అనేక రుగ్మతల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కుంకుమపువ్వు యాంటీ డిప్రెసెంట్ లక్షణాలతో పూర్తిగా నిండి ఉంటుంది. తేలికపాటి, మితమైన డిప్రెషన్ చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు డిప్రెషన్ లక్షణాలతో ఉన్నప్పుడు, చిరాకుగా ఉన్నప్పుడు మీ మానసిక స్థితిని మెరుగుపరచుకునేందుకు కుంకుమపువ్వు టీని తాగండి. ముఖ్యంగా టైప్-2 మధుమేహం, ప్రీ-డయాబెటిస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమపువ్వు టీ తాగవచ్చు. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తాయని నిరూపితమైంది.
కుంకుమపువ్వు సోరియాసిస్ సమస్యకు చికిత్స చేయడంతో పాటు చర్మపు గాయాలు ఏర్పడకుండా నిరోధిస్తుందని పలు పరిశోధనలు తేల్చాయి. అంతేకాకుండా యాంటీ ఏజింగ్ లక్షణాలు దీనిలో ఉన్నాయి. దీనిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఉండడంవల్ల వయసు మీద పడిన చర్మం యవ్వనంగానే ఉండేలా ఇది ప్రేరేపిస్తుంది. ఇవే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల ముప్పు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బులు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ నిరోధించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది.