హైదరాబాద్ లో కోటికి మందికిపైగా అనుక్షణం తమ కార్యకలాపాలు సాగిస్తూ.. ఉరుకుల పరుగుల జీవనంలో బిజీ బిజీగా గడుతుంటారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అనేక కట్టడాలు, కళలు, పర్యాటక ప్రాంతాలు, మతసామరస్యం, ఐటీ ఇండస్ట్రీ ఇలా ఒకటి కాదు రెండు.. ఎన్నో ఎన్నెన్నో.. భాగ్యనగరం స్వంతం. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియాల ఆగడాలు రోజురోజు కుపెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులను రద్దీ ఎక్కువగా ఉండే చౌరస్తాల్లో విడిచిపెట్టి భిక్షాటన చేయిస్తూ ఈ ముఠాలు లక్షలు వెనకేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో వెస్ట్‌జోన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. బెగ్గింగ్ మాఫియాల ఆటకట్టిస్తున్నారు. బెగ్గింగ్ మాఫియా చేతిలో భిక్షగాళ్లుగా మారిన వారిని రక్షిస్తూ.. ముఠా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ బెగ్గింగ్ మాఫియా నాయకులు భిక్షాగాళ్లు సేకరించిన నగదు నుంచి వారి కేవలం రూ.100, రూ.200 ఇస్తూ మిగతాదంతా తమ జేబుల్లో నింపుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఇలా ఒక్కో బెగ్గింగ్ గ్యాంగ్ నడిపే వ్యక్తి నెలకు రూ.2,00,000 నుంచి రూ.3,00,000 లక్షల వరకు వెనుకేసుకుంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
తాజాగా చిన్న పిల్లలను యాచకులుగా మార్చి రోడ్లపై వదిలేసి సాయంత్రానికి వారు తీసుకొచ్చిన డబ్బులను వసూలు చేసుకుంటున్న బెగ్గింగ్ ముఠా నిర్వాహకుడిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ హనుమంతరావు, జూబ్లీహిల్స్ ఏసీపీ కె హరిప్రసాద్, సీఐ రామకృష్ణతో కలిసి వివరాలు వెల్లడించారు. ఫిలింనగర్, బసవతారకం నగర్ బస్తీకి చెందిన వీ సూర్యప్రకాశ్ (36) ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. జల్సాలు, మద్యానికి బానిసైన అతను సులువుగా డబ్బులు సంపాదించేందుకు బెగ్గింగ్ మాఫియాకు తెరలేపాడు.
ఐదుగురు పిల్లలను చేరదీసి వారికి స్టీల్ బాక్సులు ఇచ్చి ఫిలింనగర్ బస్టాప్, పరిసర ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేయించేవాడు. సాయంత్రం వారు తీసుకొచ్చే డబ్బులు లాక్కునేవాడు. ప్రతిరోజూ ఒక్కొక్కరికి రూ. వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలయ్యేవి. ఇందులో రూ.100 చొప్పున భిక్షాటన చేసిన పిల్లలకు ఇచ్చి మిగతావి తాను తీసుకునేవాడు. దీనిపై సమాచారం అందడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఫోలీసులు, ఫిలింనగర్ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పిల్లలను రక్షించి మోండా మార్కెట్‌లోని అమన్‌వేదిక స్నేహగర్‌కు తరలించారు. నిందితుడి నుంచి స్మార్ట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.