పొడి వాతావరణం, వాతావరణ కాలుష్యం కారణంగా మన ముఖ చర్మం తీవ్రమైన అలసటకు లోనవుతుంది. అయితే.. ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని మర్దన చేసుకోవటం వల్ల వడలిపోయిన ముఖ చర్మానికి కొత్త కాంతిని, నిగారింపును తీసుకురావచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో చూద్దాం.
చర్మానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు. చర్మం, మెడ మీద ఉండే నొప్పులు తగ్గిపోతాయి. దీంతో పాటు నలుపు మచ్చలు, పేరుకున్న మట్టి తొలగిపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవ్వటంతో పాటు చర్మంలోని నూనెశాతాన్ని తగ్గించే ఈ ఐస్ క్యూబ్స్ బ్యూటీ టిప్స్‌ను తెలుసుకుందాం.
ఓ గిన్నెలో కొద్దిగా నీరు తీసుకుని 4 తులసి ఆకులు, 2 చెంచాల అలోవేరా జెల్ వేసి కలిపి దానిని ఫ్రిజ్‌లోని ఐస్‌క్యూబ్స్ ట్రేలో పెట్టి, ఆ ఐస్‌క్యూబ్స్‌తో ముఖం, మెడ, వీపు, భుజాల మీద ఒకే దిశలో సున్నితంగా మర్దనా చేయటం వల్ల ముఖం మీద మచ్చలు పోవటమే గాక డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుంది. గిన్నెలో కప్పు రోజ్‌వాటర్, మరో కప్పు నీరు తీసుకుని ఫ్రిజ్‌లోని ఐస్‌క్యూబ్స్ ట్రేలో పెట్టి, ఆ ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా చర్మంపై రుద్దితే ముడతలతో బాటు స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ కూడా తొలగిపోతాయి. ముఖచర్మానికి మంచి నిగారింపు వస్తుంది.
గిన్నెలో కీరదోస తరుగు, ఐదారు చుక్కల నిమ్మరసం కలిపి, ఫ్రిజ్‌లోని ఐస్‌క్యూబ్స్ ట్రేలో పెట్టి, ఆ ఐస్‌క్యూబ్స్‌తో ముఖంపై సున్నితంగా రుద్దటం వల్ల ముఖ కండరాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. మొటిమలు, మంగు మచ్చలు తగ్గిపోతాయి. అరచెంచా కుంకుమ పువ్వు, నాలుగుచెంచాల రోజ్ వాటర్‌లో కలిపి ఫ్రిజ్‌లోని ఐస్‌క్యూబ్స్ ట్రేలో పెట్టి, ఆ ఐస్‌క్యూబ్స్‌తో ముఖం మీద రుద్దితే స్కిన్‌టోన్ మారి, తాజాగా కనిపిస్తుంది. పసుపు, రోజ్ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్ చేసుకుని ముఖం మీద మసాజ్ చేస్తే.. పిగ్మెంటేషన్‌తో పాటు కళ్ల కింద మచ్చలు తగ్గిపోతాయి. యంగ్ లుక్ మీ సొంతమవుతుంది. కంటి కింది కండరాలకు రక్తప్రసరణ సాఫీగా జరిగి, ఆ భాగంలో ఒత్తిడి తగ్గిపోతుంది.