చీకటిగా ఉన్న గదిలోకి వెళ్లాలంటే కొంత మంది భయపడుతుంటారు. అలాంటిది ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా 500రోజుల పాటు ఒంటరిగా ఒక గుహలో గడిపింది ఒక మహిళ. యుక్రెయిన్‌పై రష్యా ఇంకా యుద్ధం ప్రారంభించకముందు, కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వీడకముందు బీట్రిజ్ ఫ్లామిని అనే మహిళ స్పెయిన్‌లోని గ్రానాడాలో ఒక గుహలోకి వెళ్లారు. అక్కడే రెండు పుట్టినరోజులు జరుపుకున్న ఆమె.. తాజాగా తన సాహసాన్ని పూర్తి చేసుకొని గుహ నుంచి బయటికి వచ్చారు. ఆమె గురించి కొన్ని విశేషాలు.. స్పెయిన్‌కు చెందిన 50 ఏళ్ల ‘బియాట్రిజ్ ఫ్లమిని’ వృత్తిరీత్యా సాహస క్రీడాకారిణి. పర్వతారోహకురాలు కూడా.. పర్వతారోహణపై ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తుంటుంది. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎన్నో విజయాలు నమోదు చేసిన ఆమె.. పలు అవార్డులు కూడా అందుకుంది.
బియాట్రిజ్ ఫ్లమిని స్పెయిన్‌లోని మోత్రిల్ అనే నగరంలో గ్రెనడాలోని గుహలోకి 230 అడుగుల లోతుకు నవంబర్ 21, 2021న ప్రవేశించింది. గుహలోకి వెళ్లే అప్పుడు ఆమె వయసు 48సంవత్సరాలు. రెండు GoPro కెమెరాలు, 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీళ్లను ఆమె గుహలోకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళింది. సమాజంలోని మనుషులతో సంబంధం లేకుండా ఒంటరితనం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఆమె ఈ ప్రయోగం చేపట్టారు. శాస్త్రవేత్తలు సునిశితంగా ఈ ప్రయోగాన్ని పరీక్షించారు.
స్పెయిన్‌లోని గ్రెనడా, అల్మేరియా విశ్వవిద్యాయాలకు చెందిన శాస్త్రవేత్తలు, మాడ్రిడ్‌కు చెందిన ఓ స్లీప్ క్లినిక్ సంయుక్తంగా.. ‘టైమ్‌వేవ్’ పేరుతో ఓ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో భాగంగా.. రోజులో ఒక వ్యక్తిలో శారీరకంగా, మానసికంగా, ప్రవర్తన పరంగా జరిగే మార్పులు; మెదడు సామర్థ్యం; ఒంటరిగా-సమయం తెలియని అయోమయ పరిస్థితులు నిద్రపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న.. పలు అంశాలపై అధ్యయనం చేయాలనుకున్నారు. ఆమె గుహలో ఉన్న సమయంలో డ్రాయింగ్స్ వేయడం, నూలు దారాలతో హ్యాట్‌లను తయారు చేయడం, పుస్తకాలు చేయడం, ఆమె అనుభవాన్ని గో ప్రో కెమెరాలతో డాక్యుమెంటరీ తీసింది.
ఈ 500రోజుల పాటు ఆమెను సైకాలజిస్ట్‌లు, రీసెర్చర్లు, స్పెలియోజిస్ట్‌ల(గుహలను అధ్యయనం చేసే నిపుణుల) బృందం, ఈ అధ్యయనంలో భాగమైన శాస్త్రవేత్తలు, ఫిట్‌నెస్ ట్రైనర్స్.. నిరంతరం పర్యవేక్షించారు. కానీ, ఏ నిపుణులు కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. గుహలోకి వెళ్లిన రెండు నెలల తరువాత తాను సమయాన్ని మిస్సయ్యానని, ‘ఏడాదిన్నర పాటు గుహలో నేను ఒంటరిగా బతికాను. నాతో నేను తప్ప ఎవరూ మాట్లాడలేదు’’ అంటుంది గుహలో నుంచి బయటికి వచ్చిన బీట్రిజ్. ఒకానొక సమయంలో ఈగలు నాపై దాడి చేశాయి. ఆ ఒక్క చేదు సంఘటన తప్ప గుహలో ఇన్ని రోజులూ సంతోషంగా గడిచిపోయాయి..’ అంటూ చెప్పుకొచ్చిందీ డేరింగ్ అథ్లెట్.
ఇటీవలే గుహ నుంచి బయటికి వచ్చిన బ్రిటీజ్ ని శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు పరిశీలిస్తున్నారు. గతంలో ఈ తరహా రికార్డులు రెండు నమోదయ్యాయి. 1987లో ఇటలీకి చెందిన సోషియాలజిస్ట్ మౌరిజియో 210 రోజులు గుహలో గడిపి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆపై 2016లో సెర్బియాకు చెందిన ఓ వ్యక్తి ఈ రికార్డును బద్దలుకొడుతూ 460 రోజులు భూగర్భంలో గడిపారు. ఇక ఇప్పుడు ‘గుహలో అత్యధిక కాలం జీవించిన వ్యక్తి’గా బియాట్రిజ్ పేరును గిన్నిస్ వారు పరిశీలిస్తున్నారు.