కరీంనగర్ పట్టణంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. నడిరోడ్డుపై సంచరిస్తూ నగర వాసులను హడలెత్తించింది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో కాలనీవాసులు నిద్ర లేకుండా గడిపారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత స్థానిక యువత కర్రలు పట్టుకుని గస్తీ చేపట్టారు.
శనివారం ఉదయం రేకుర్తిలో నడిరోడ్డుపై సంచరిస్తూ ప్రజలకు కనిపించింది. దీంతో ఎలుగు బంటిని చూసిన పట్టణవాసులు భయంతో పరుగులు పెట్టారు. ఎలుగుబంటి సంచరిస్తుండగా.. దృశ్యాలను స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇళ్ల మధ్యలో ఉన్న చెట్ల పొదల మధ్య ఎలుగు బంటి ఉన్నట్లు గుర్తించి దానికి మత్తు ఇంజెక్షన్ షాట్ చేశారు.
ఎలుగుబంటి మత్తులోకి జారుకున్నాక అటవీ అధికారులు దాన్ని బంధించారు. మెుత్తం 12 గంటల పాటు ఎలుగు బంటి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగా.. ఎట్టకేలకు దాన్ని బంధించారు. వైద్య పరీక్షల ఆనంతరం దాన్ని అటవీ ప్రాంతాలో విడచిపెట్టనున్నలు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. తమ కంటిమీద కునుకు లేకుండా చేసిన ఎలుగుబంటి చిక్కటంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.