హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని నగర పోలీసు విభాగం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 9న ఉండగా.. ఆ మరుసటి రోజే పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ ఉంది. వరుసగా రెండు రోజుల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే.. సెక్యూరిటీపరంగా ఇబ్బందులు వస్తాయని హైదరాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐకి హెచ్‌సీఏ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు.
వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూలింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండవని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ‘ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు జరగనున్న ఉప్పల్ స్టేడియంకు నేను ఇన్‌ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నా. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. అయితే ప్రపంచకప్ షెడ్యూల్‌ను మార్చడం అంత సులభం కాదు. షెడ్యూల్ మార్చే అవకాశం లేదు. కేవలం బీసీసీఐ మాత్రమే షెడ్యూల్‌ను మార్చలేదు. జట్లు, ఐసీసీ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని రాజీవ్ శుక్లా అన్నారు. శుక్లా వ్యాఖ్యలను బట్టి రీషెడ్యూల్‌కు అవకాశం లేదని స్పష్టం అయింది.
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్ 10న శ్రీలంకతో పాక్ తలపడనుంది. అంతేకాదు మెగా టోర్నీకి ముందు రెండు వార్మప్ మ్యాచ్‌లను కూడా ఉప్పల్‌లోనే పాకిస్తాన్ ఆడనుంది. అంటే మెగా టోర్నీ కోసం వచ్చే పాక్ జట్టు హైదరాబాద్‌లోనే ఎక్కువ రోజులు గడపనుంది. పాకిస్థాన్ మ్యాచ్ కావడంతో హైదరాబాద్‌లో భద్రత మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే హైదరాబాద్ పోలీస్ విభాగం, హెచ్‌సీఏ ఆందోళన వ్యక్తం చేసింది.