2011 తర్వాత స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే భారత(INDIA) క్రికెట్ జట్టును బీసీసీఐ(BCCI) తాజాగా ప్రకటించింది. ప్రపంచకప్ నెగ్గి పుష్కరకాలం (చివరిసారి ధోని సారథ్యంలో 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచింది) దాటిన నేపథ్యంలో అక్టోబర్ నుంచి భారత్‌లోనే జరుగబోయే ఈ మెగా టోర్నీని గెలుచుకోవాలని టీమిండియా(TEAM INDIA) భావిస్తున్నది. భారత్ చివరిసారి 2013లో ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. పదేండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ నెగ్గేందుకు గాను భారత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. తాజాగా రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం శ్రీలంకలోనే ఉన్న ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌తో కలిసి టీమిండియా సారథి రోహిత్ శర్మ(ROHITH SHARMA) భారత జట్టును ప్రకటించారు.
భారత వరల్డ్ కప్ టీమ్‌లో అందరూ ఊహించినట్టుగానే భారీ మార్పులైతే చోటు చేసుకోలేదు. లాస్ట్ మినిట్ ఛేంజెస్ కూడా ఏమీ లేవు. సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచేయి చూపగా జట్టులో చోటు ఆశించిన తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలకూ ఛాన్స్ దక్కలేదు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించిన కెఎల్ రాహుల్ వరల్డ్ కప్ టీమ్‌లో చోటు సంపాదించాడు. అశ్విన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చినా వాళ్లెవరూ ఎంపికకాలేదు. ఇటీవల ప్రకటించిన ఆసియా కప్‌కు ఎంపికైన జట్టులో స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయని ఇదివరకే అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ హింట్ కూడా ఇచ్చారు. అందరూ అనుకున్నట్టుగానే ఆసియా కప్‌కు ఎంపిక చేసిన టీమ్‌లోని ముగ్గురు సభ్యులను తొలగించి 15 మంది సభ్యులను ప్రకటించింది బీసీసీఐ..
రోహిత్ శర్మ సారథిగా ఉండే భారత జట్టులో శుభ్‌మన్ గిల్(SUBHAMAN GILL), విరాట్ కోహ్లీ(VIRAT KOHLI), సూర్యకుమార్ యాదవ్(SURYAKUMAR YADAV), శ్రేయాస్ అయ్యర్(SHREYAS AYER)లు పూర్తిస్థాయి బ్యాటర్లు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా కెఎల్ రాహుల్(KL RAHUL) ఎంపిక కాగా అతడికి బ్యాకప్‌గా ఇషాన్ కిషన్(ISHAN KISHAN) ఎంపికయ్యాడు. సీమ్ ఆల్ రౌండర్‌గా హార్ధిక్ పాండ్యా(HARDHIKH PANDYA).. స్పిన్ ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా(RAVINDRA JADEJA), అక్షర్ పటేల్(AKSHAR PATEL)లకు చోటు దక్కింది. స్పిన్నర్‌గా కుల్దీపన్ యాదవ్(KULDEEP YADAV) తన స్థానాన్ని నిలబెట్టుకోగా ముగ్గురు స్పిన్నర్లు జస్ప్రిత్ బుమ్రా(JASPRIT BHUMRA), మహ్మద్ షమీ(MOHAMMAD SHAMI), మహ్మద్ సిరాజ్(MOHAMMAD SIRAJ)లు భారత బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల శార్దూల్ ఠాకూర్ కూడా చోటు దక్కించుకున్నాడు. తుది జట్టు కూర్పు ఎలా ఉండనున్నా.. వరల్డ్ కప్‌లో భారత జట్టులో ఐదుగురు బ్యాటర్లు, ఒక సీమ్ ఆల్ రౌండర్, వికెట్ కీపర్ బ్యాటర్, స్పిన్ ఆల్ రౌండర్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది. పిచ్, పరిస్థితులకు తగ్గట్టు తుది జట్టులో మార్పులు ఉండొచ్చు.