మరో 10 రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందులో పాల్గొనే జట్లన్నీ సాధన ముమ్మరం చేశాయి. ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ దేశాలు జట్లను సైతం ప్రకటించాయి. అందుకోసం ప్రాక్టీసు చేస్తూ.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు అనుసరిస్తున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అయితే ఆ దేశ రాజధాని ఢాకాలోని జాతీయ క్రికెట్ అకాడమీలో ముమ్మరంగా సాధనం చేస్తోంది. వరుసగా ప్రాక్టీసు సెషన్స్ నిర్వహిస్తోంది. భారత్, పాకిస్థాన్ లాంటి మేటి జట్లు పాల్గొనే ఈ పోటీల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అసలే రెండు నెలల్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్నందున అందుకోసం కూడా ఆయా జట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఫిట్‌నెస్ పెంచుకునేందుకు, ఒత్తిడిని తట్టుకునేందుకు, ప్రాక్టీసు ముమ్మరం చేసుకునేందుకు ఆయా జట్లు తమ ప్లేయర్లకు అనుగుణంగా శిక్షణ ఇప్పిస్తున్నాయి.
అయితే బంగ్లాదేశ్ ఆటగాడు మహ్మద్ నయీమ్ షేక్ మాత్రం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ట్రైనింగ్‌లో భాగంగా నిప్పులపై నడిచాడు. అది ఆట పెంచుకునేందుకో, ఫిట్‌నెస్ మెరుగుపర్చుకునేందుకు కాదు. ఒత్తిడి తట్టుకునేందుకు అతడు ఈ సెషన్‌లలో పాల్గొంటున్నాడు. సబిత్ రేహాన్ అనే ట్రైనర్ సాయంతో నయీమ్ ఈ ఫీట్‌ను చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొందరు నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లా క్రికెటర్ సన్నద్ధత వెరైటీగా ఉందని కొందరు అంటున్నారు. మరికొందరేమో అతను పిచ్చిపనులు చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే, నిప్పులపై నడవడం ద్వారా మెదడు చురుగ్గా మారి, భయం పోతుందని, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బంగ్లా క్రికెట్ టీమ్ మేనేజర్ ఓ ఆర్టికల్‌ను తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు.