నలుగురు ఆలోచించని విధంగా ఆలోచిస్తానే విజయాన్ని సాధించగలం. సాధారణంగా అందరూ చేసే పనినే భిన్నంగా చేసి సంచలనాలు సృష్టిస్తుంటారు కొందరు. బెంగళూరుకు చెందిన ఇద్దరు ఇలాగే కొత్తగా ఆలోచించారు. పిజ్జాలు, బర్గర్లతోనే కాదు.. సమోసాలు అమ్మి కూడా వ్యాపారం చేయవచ్చు అనే ఆలోచనతో మొదలైంది ఈ జంటల ప్రయాణం. భవిష్యత్‌లో ప్రపంచ దేశాల్లో సైతం సమోసాలు అమ్మి వేలకోట్ల టర్నోవర్ సాధించేలా ప్రణాళికలు రచిస్తున్న ఈ జంటలు. తోపుడు బండి మీద అమ్మే సమోసాలతో ఒకరు సమోసా సింగూ అంటుంటే ఇంకొకరు సమోసా పార్టీ అంటూ.. వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. సక్సెస్ ఫుల్ స్టార్టప్స్ వెనకా ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సమోసా సింగ్
బెంగళూరుకు చెందిన నిధి, శిఖర్ సింగ్ దంపతులు.. సమోసాలు విక్రయిస్తూ రోజుకు రూ.12 లక్షల వరకు సంపాదిస్తుండటం విశేషం. లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాలు వదిలేసి.. పెట్టుబడి కోసం ఉన్న ఫ్లాట్‌ను కూడా అమ్మేసుకున్నారు. స్టార్టప్ సమోసా సింగ్‌ను స్టార్ట్ చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు రోజుకు రూ.12 లక్షలు వస్తున్నాయి. వీరికి దేశవ్యాప్తంగా మొత్తం 40కిపైగా సమోసా సింగ్ అవుట్‌లెట్స్ ఉండటం విశేషం. ఇక్కడ బటర్ చికెన్ సమోసా, కడాయ్ పనీర్ సమోసా చాలా స్పెషల్ అంటున్నారు సమోసా సింగ్ అభిమానులు. ఉన్న ఉద్యోగాల్ని వదిలేసినా.. వారెప్పుడూ బాధ పడే స్థితి రాలేదు. తొలుత బెంగళూరులో పుట్టిన ఈ సమోసా సింగ్.. ఇప్పుడు పలు నగరాల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. కలల ఇంటిని అమ్మేసినా కూడా వారు భవిష్యత్తులో ఎలాంటి లాభాలు వస్తాయనే దాని గురించే ఆలోచించారు.
సమోసా పార్టీ
బెంగళూరుకు చెందిన అమిత్ నన్వానీ, దీక్ష పాండేలకు సమోసాలను విభిన్నంగా ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా సమోసాకు కూడా ఓ బ్రాండ్ తీసుకురావాలని ప్రయత్నించారు. కేవలం పిజ్జాలు, బర్గర్లనే ఆన్‌లైన్‌లో విక్రయించాలా.? సమోసాలను ఎందుకు విక్రయించకూడదని ఫుడ్ డెలివరీ యాప్స్‌లోనూ విక్రయించడం ప్రారంభించారు. ‘సమోసా పార్టీ’ పేరుతో బెంగళూరులో వ్యాప్తంగా 15 స్టోర్‌లను ఓపెన్ చేశారు. వీరి వ్యాపారం కేవలం బెంగళూరుకే పరిమితం కాలేదు గురుగ్రామ్‌లో కూడా ఒక స్టోర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీరు సమోసా తయారు విధానంలో కూడా భిన్నత్వాన్ని పాటించారు. ఏకంగా 14 రకాల సమోసాలను తయారు చేశారు. వీరు అమ్మే ప్రతీ సమోసాపై ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ బట్టి సమోసా లోపల ఎలాంటి పదార్థాలను ఉపయోగించారన్న విషయాన్ని చెబుతుంది. నాణ్యత, రుచి విషయంలో రాజీ పడకపోవడమే తమ సక్సెస్‌కు కారణమని చెబుతారు అమిత్ నన్వానీ, దీక్ష పాండేలు. సమోసా పార్టీ ప్రతి నెలా 50,000ల సమోసాలను అమ్ముతున్నారు. ఇలా ఏడాదికి ఏకంగా 50 లక్షల సమోసాలను అమ్ముతూ కోట్ల రూపాయలను గడిస్తున్నారు.