ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ మంత్రి ఆర్కే రోజా(Minister Roja)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి Former Minister Bandaru Satyanarayana murthi) అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అనకాపల్లి పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. అటు టీడీపీ శ్రేణులు(TDP ranges) కూడా ఆయన ఇంటివద్దకు చేరుకుంటున్నాయి. దీంతో ఇరు వర్గాల మోహరింపుతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతోంది. ఆదివారం రాత్రి పది దాటిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని రౌండప్ చేశారు. అటువైపుగా ఎవర్నీ రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల మూమెంట్ చూసిన టీడీపీ శ్రేణులు, బండారు అభిమానులు ఒక్కొక్కరిగా అక్కడకు రావడం మొదలు పెట్టారు. అయితే వారెవర్నీ బండారు ఇంటివైపు రాకుండా పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. తమ లీడర్ ఇంటికి వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను టీడీపీ శ్రేణులు నిలదీయడం మొదలు పెట్టాయి.
మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana)పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ(Vasireddy Padma) డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాపై సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఒక మంత్రిపై రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్ లు పెట్టి మరీ.. బండబూతులు మాట్లాడుతున్నారని.. వీటిని ఎంత మాత్రం సహించరాదని పేర్కొన్నారు. వెంటనే కేసు నమోదు చేసి.. తక్షణం అరెస్టు చేయాలని డీజీపికి విజ్ఞప్తి చేశారు. మంత్రి రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు మహిళా నేతలు, న్యాయవాదులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. బండారు వంటి మహిళా వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెప్పాలని.. అతని వ్యాఖ్యలపై అందరూ సీరియస్ గా స్పందించాలని కోరారు.