వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన భారత స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతారు.. రకరకాల మాటలు మాట్లాడుతుంటారు.. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అందరం కలసి కష్టపడి పనిచేస్తామని తెలిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. వైఎస్ జగన్ వన్ కేబినెట్‌లో మంత్రిగా సేవలు అందించిన ఆయన.. రెండో కేబినెట్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. సామాజిక సమీకరణలు, వివిధ కారణాలతో ఆయన మంత్రి పదవి త్యాగం చేయాల్సి వచ్చిందని చెబుతుంటారు. ఇదే సమయంలో.. కొంతకాలం ఆయన అలకబూనడం.. అధిష్టానం బుజ్జగించడం జరిగిపోయాయి. ఆ తర్వాత సీఎం పర్యటనలో మరోసారి ఆయన అలిగారనే వార్తలు వచ్చాయి.. అయినా ఆయన యథావిథిగా పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. మరోవైపు.. ఈడీ కేసుల్లో చిక్కుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మరోసారి టికెట్ దక్కుతుందానే అనే చర్చ సాగుతూ వచ్చింది. కానీ, ఈ రోజు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను.. ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారంటూ క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.