గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా ‘భగవంత్ కేసరి’. విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. విడుదలకు ఇంకా సుమారు రెండు నెలల సమయం ఉంది. అయితే, అప్పుడే థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ కావడం విశేషం. భగవంత్ కేసరి’ నైజాం థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను 14 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సీడెడ్ (రాయలసీమ) హక్కులు రూ. 12 కోట్లు పలకగా.. ఆంధ్ర ఏరియా హక్కులను సుమారు 34 కోట్ల రూపాయలకు ఇచ్చారట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్టాల హక్కులను రూ. 60 కోట్లకు అమ్మేశారు. ‘వీర సింహా రెడ్డి’తో సంక్రాంతికి బాలకృష్ణ భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 63 కోట్లు. దాంతో పోలిస్తే.. ‘భగవంత్ కేసరి’కి జస్ట్ మూడు కోట్లు మాత్రమే తక్కువ.
ఇప్పుడు ‘భగవంత్ కేసరి’కి బాలకృష్ణ ముందు ఉన్న టార్గెట్ రూ. 62 కోట్లు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే… అంత కలెక్ట్ చేయాలి. దసరా బరిలో సినిమా విడుదల అవుతుంది కనుక అంత రాబట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు. అక్టోబర్ 19 గురువారం వచ్చింది. అప్పటి నుంచి 24వ తేదీ పండగ వరకు సెలవులు ఉంటాయి కనుక మంచి వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది. థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా ‘భగవంత్ కేసరి’కి రూ. 60 కోట్లు వస్తే… ఓటీటీ / డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా రూ. 36 కోట్లు వచ్చినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని టాక్. విడుదలకు ముందు నిర్మాతలకు దాదాపుగా 100 కోట్లు వచ్చాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ జోడీగా తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్న ‘భగవంత్ కేసరి’లో యువ కథానాయిక శ్రీ లీల ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో ‘నెలకొండ భగవంత్ కేసరి’ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారు. నిజ జీవితంలో ఆయన పేరును స్ఫురించేలా సినిమాలో పేరును అనిల్ రావిపూడి డిజైన్ చేయడం విశేషం. ‘రాజు ఆని వెనుక ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు’ అని టీజర్‌లో బాలకృష్ణ చెప్పే డైలాగ్ ఆల్రెడీ అభిమానుల్ని ఆకట్టుకుంది. ఇక, టీజర్ చివరిలో తర్వాత బ్యాట్ పట్టుకుని బాలకృష్ణ గిటార్ కింద వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్లడం హైలైట్!