బాలాపూర్ లడ్డూ (Balapur Ganesh) ఈ ఏడాది సైతం రికార్డు స్థాయి ధర పలికింది. తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానందరెడ్డి.. వేలం పాటలో 27 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. గతేడాది 24 లక్షల 60 వేల రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూ(Laddu).. ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈసారి మరో 2 లక్షల 40 రూపాయలు ఎక్కువ పలికింది. భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాటకు ఘన చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే.. వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బాలాపూర్ గణేశ్(Balapur Ganesh) లడ్డూ ఈసారి కూడా రికార్డుస్థాయి ధర పలికింది. పోటాపోటీగా జరిగిన వేలంపాటలో స్థానికేతరుడైన తుర్కయంజాల్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి దాసరి దయానందరెడ్డి(Dasari Dayananda Reddy).. 27 లక్షల రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు.
గతేడాది 24 లక్షల 60 వేల రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూ.. ఈసారి 2 లక్షల 40 వేల రూపాయలు అధికంగా పలికి.. 27 లక్షల రూపాయల రికార్డును నమోదు చేసింది. వేలంపాటలో ఉత్సవ సమితి సభ్యులతోపాటు ఏడుగురు కొత్తవాళ్లు పోటీపడ్డారు. నువ్వానేనా అన్నట్లు జరిగిన వేలంపాటలో చివరికి దాసరి దయానందరెడ్డి లడ్డూ విజేతగా నిలిచారు.బాలాపూర్ గణేశుడి(Balapur Ganesh) లడ్డూ దక్కించుకునేందుకు గతంలోనూ పోటీపడ్డానని.. ఈసారి లంబోదరుడు కరుణించాడని దయానందరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ లడ్డూను తన తల్లిదండ్రులకు అంకితం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాలాపూర్ గణేశ్ లడ్డూతో స్థానిక ఆలయంలో కుటుంబసభ్యులతో కలిసి దయానందరెడ్డి పూజలు నిర్వహించారు. లడ్డూవేలంపాటను వీక్షించేందుకు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బాలాపూర్ గ్రామ కూడలి జనసంద్రంగా మారింది.
1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలంపాట.. వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షల పలుకుతోంది. 2001వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. 2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి లక్షా 5 వేల రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందనచారి 4 లక్షల 15 వేల రూపాయలకు పాటపాడి లడ్డూను దక్కించుకున్నారు. 2015లో బాలాపూర్ లడ్డూ 10 లక్షల రూపాయలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్ మోహన్‌రెడ్డి 10 లక్షల 32 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. 2016లో మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు. 2017లో నాగం తిరుపతిరెడ్డి 15 లక్షల 60 వేల రూపాయలకు పొందగా.. 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేల రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వరుసగా మూడేళ్లు స్థానికేతరులనే బాలాపూర్ గణేశుడు కరుణించాడు. 2019లో జరిగిన వేలంపాటలో అవకాశం స్థానికులకు దక్కింది. కొలను రాంరెడ్డి 17 లక్షల 60 వేల రూపాయలు పాడి బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు.