ఏపీలో పుంగనూరు, అంగళ్లలో జరిగిన ఘటనలకూ తమకు ఎలాంటి సంబంధం పలువురు టీడీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. అయినప్పటికీ పొలాలలో పని చేసుకుంటున్న తమని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. మంత్రి పెద్దరెడ్డి ప్రోత్సాహంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదనే భయంతోనే టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.పుంగనూరు, అంగళ్ళ ఘటనలో అరెస్టైన టీడీపీ కార్యకర్తలు, నేతలు కడప కేంద్ర కారాగారంలో 157 రిమాండ్‌లో ఉన్నారు. వారిలో 52 మందిని ఇవాళ బెయిల్ పై విడుదల చేశారు. వారందరికీ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు స్వాగతం పలికారు. బెయిల్ పై బయటకు వచ్చిన వారికి మిఠాయిలు తినిపించారు.
అనంతరం అరెస్టైన వారి బంధువులను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పుంగనూరు సమావేశానికి వస్తున్నారని తాము వెళ్లామని తెలిపారు. మెుదట పెద్దిరెడ్డి వర్గానికి చెందిన వారే తమపై దాడులు చేశారని బాధితులు పేర్కొన్నారు. ఆరోజు ఘటన జరిగిన ప్రదేశంలో తాము లేకపోయినప్పటికీ.. పోలీసులు అక్రమంగా తమపై కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 45 రోజులు పాటు జైల్లో ఉన్నామని తెలిపారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆడిన నాటకమేనని స్పష్టం చేశారు.
అరెస్ట్‌లపై వైఎస్ఆర్ కడప జిల్లా తెలుగుదేశం బాధ్యులు మాధవి రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్‌కు తెలిసిందల్లా… తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే అని విమర్శించారు. అంతకు మించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పట్టించుకోరని ఆరోపించారు. అనవసరంగా 157 మందిపై తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శించారు. మాజీ శాసనసభ్యులు షాజహాన్ మాట్లాడుతూ… ఘటన జరిగిన రోజు తాను చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నానని తెలిపారు. మొదట చంద్రబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. ఆ సమయంలో ఎన్ఎస్జీ కమాండోలు ఆయనకు రక్షణగా నిలిచారని పేర్కొన్నారు. అలాంటి చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చారని మండిపడ్డారు. పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. పెద్దిరెడ్డి డ్రామాలు ఎంతో కాలం సాగవని తెలిపారు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జైల్లో ఉన్న మరి కొంతమంది త్వరలోనే బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.