Health Tips: నేటి ఆధునిక జీవనశైలిలో బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది ఉదయం తినే ఆహారం సాయంత్రం.. సాయంత్రం తినే ఆహారం ఉదయం తింటున్నారు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. చాలా సార్లు ఆహారాన్ని వండిన తర్వాత ప్రజలు వేడిగా తినే బదులు దానిని ఫ్రిజ్లో స్టోర్ చేస్తున్నారు. అవసరమైనప్పుడు తిరిగి వేడి చేసి తింటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కొంతమంది మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారు. ఇలా చేయడం మనందరికీ సాధారణంగానే అనిపిస్తుంది కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం
బంగాళాదుంపలు
బంగాళదుంపల్లో స్టార్చ్ ఉంటుంది. ఇది మళ్లీ వేడిచేసినప్పుడు విడిపోయి విషంగా మారుతుంది. ఈ టాక్సిన్స్ కడుపు నొప్పి, వికారం, వాంతులు కలిగిస్తుంది.
గుడ్డు
గుడ్లు ప్రొటీన్‌ను కలిగి ఉంటాయి. వీటిని మళ్లీ వేడి చేసినప్పుడు హానికరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. దీని లక్షణాలు అతిసారం, కడుపు నొప్పి, జ్వరాన్ని కలిగిస్తాయి.
బచ్చలికూర
బచ్చలికూరతో చేసిన వాటిని మళ్లీ వేడి చేసి తినకూడదు. ఎందుకంటే దీనిలో నైట్రేట్ ఉంటుంది. ఇది మళ్లీ వేడి చేసినప్పుడు నైట్రోసమైన్‌గా మారుతుంది. నైట్రోసమైన్ ఒక క్యాన్సర్ కారకం. బచ్చలికూరలో నైట్రేట్ కంటెంట్ సాధారణంగా తక్కువగా ఉంటుంది. కానీ దానిని మళ్లీ వేడి చేసినప్పుడు అది నైట్రోసమైన్‌లుగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. అధిక మొత్తంలో నైట్రోసమైన్ తీసుకోవడం వల్ల కడుపు, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
చికెన్
చికెన్‌ని మళ్లీ వేడి చేయడం వల్ల అందులో ఉండే ప్రొటీన్లు విడిపోయి వేరే రూపాన్ని తీసుకుంటాయి. ఇది ఆరోగ్యానికి హానికరం. చాలా సందర్భాల్లో చికెన్ ఉడికిన తర్వాత కూడా హానికరమైన బ్యాక్టీరియా బతికే ఉంటుంది. ఉడికించిన చికెన్‌ను మైక్రోవేవ్‌లో ఉంచినట్లయితే బ్యాక్టీరియా మాంసం అంతటా వ్యాపిస్తుంది.
రైస్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో అన్నం ఒకటి. దీనిని కూడా మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడదు. చాలా ఇళ్లలో మధ్యాహ్న, రాత్రి భోజనానికి అన్నం ఒకేసారి వండుతారు. ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకారం కోల్డ్ రైస్‌ను మళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అన్నాన్ని పొయ్యిలోంచి దించి వదిలేస్తే అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ పూటకు ఆ పూటే వండుకు తినాలి.