తాజాగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలో ‘సికెస్ట్ డే ఆఫ్ ది ఇయర్’ (ఏడాదిలో అత్యంత అనారోగ్య దినం) గా ఆగస్టు 24 నిలిచింది. అమెరికాలోని వివిధ కంపెనీలు, కార్యాలయాలు, వాటి పని దినాలు తదితర అంశాలకు సంబంధించి ఫ్లెమింగో అనే ఓ వెబ్‌సైట్ ఐదేళ్లుగా చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ఈ ఐదేళ్ల కాలంలో వివిధ కంపెనీలు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలా మంది ఆగస్టు 24వ తేదీన సిక్ లీవ్స్ పెట్టారట. గడిచిన ఐదేళ్లలో సిక్ లీవ్స్‌ను పరిగణలోకి తీసుకున్న ఫ్లెమింగో.. ప్రతి ఏడాది ఎక్కువ సిక్ లీవులు ఆగస్టు 24వ తేదీ నాడే ఉన్నట్లు గుర్తించింది. దాంతో ‘సికెస్ట్ డే ఆఫ్ ది ఇయర్’గా ఆగస్టు 24ను గుర్తించింది.
ఈ ఆగస్టు 24 నాటి అనారోగ్య సెలవుల్లో కడుపు నొప్పిని కారణంగా చూపి తీసుకున్న సెలవులే ఎక్కువగా ఉన్నట్లు ఫ్లెమింగో వెల్లడించింది. ఆగస్టు 24 తర్వాత ‘సికెస్ట్ డే ఆఫ్ ది ఇయర్’గా ఫిబ్రవరి 13 నిలిచింది. గత ఐదేళ్లలో ప్రతి ఏడాది ఆగస్టు 24 తర్వాత అత్యధిక అనారోగ్య సెలవులు తీసుకున్న రోజుగా ఫిబ్రవరి 13 తేలింది.