ప్రముఖ పుణ్యక్షేత్రంతిరుమలలోని అలిపిరి కాలినడక మార్గంలో ఆదివారం రాత్రి బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించినట్లు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ (సీసీఎఫ్‌వో) నాగేశ్వరరావు తెలిపారు. చిరుత రక్త నమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. జూ క్వారంటైన్‌లో ఇటీవల పట్టుబడిన 2 చిరుతలున్నాయని.. బాలిక లక్షితపై దాడి చేసింది ఏ చిరుత అనేది ఇంకా తేలలేదని నాగేశ్వరరావు చెప్పారు. ఏ చిరుత దాడి చేసిందో వైద్య పరీక్షల నివేదికలో తెలుస్తుందన్నారు. వన్య ప్రాణుల జాడల కోసం 300 కెమెరాలతో నిరంతరం అన్వేషణను కొనసాగిస్తున్నామని తెలిపారు. కాలిబాటలో శాశ్వతంగా 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి వన్య ప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు.
అలిపిరి కాలినడక మార్గంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిరుత పులి దాడి చేయడంతో ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మరో గంట ప్రయాణిస్తే తిరుమలకు చేరుకుంటామనుకునే సమయంలో ముందుగా వెళుతున్న బాలికపై చిరుత పులి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. తీవ్ర భయాందోళనలతో వారు ఒక్కసారిగా కేకలు వేయడంతో చిరుత బాలికను అడవిలోకి ఈడ్చుకెళ్లిందని తెలుస్తోంది.
నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెంకు చెందిన కుటుంబం శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంకో గంట సమయం ప్రయాణిస్తే తిరుమలకు చేరుకునేవారు. అదే సమయంలో కుటుంబ సభ్యుల కంటే ముందుగా నడిచి వెళుతున్న చిన్నారి లక్షితపై చిరుత పులి ఒక్కసారిగా దాడి చేసింది. బాలికను చిరుత అడవిలోకి లాక్కెళ్లడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చేపట్టేందుకు వీలుపడలేదు. ఉదయం వేళ గాలింపు చేపట్టిన పోలీసులు.. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరంలో బాలిక మృతదేహం కనిపించింది. అప్పటికే చిరుత బాలిక మృతదేహాన్ని సగం తినేసినట్టు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.