రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. అనునిత్యం ఎక్కడో ఒకచోట స్త్రీలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అతికిరాతకంగా సామూహిక అత్యాచారాలకు పాల్పడుతూ.. పైశాచికంగా స్త్రీలపై పురుషులు ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్లలతో మొదలై ముసలి వాళ్ళను కూడా వదలకుండా పిశాచాల మాదిరిగా లైంగిక చర్యలకు పాల్పడుతున్నారు. దేశమంతటితో పోల్చుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తమ కార్యకలాపాలకు అడ్డువస్తున్నారని, లేదా ఇళ్ల స్థలాల గొడవ, అక్రమ సంబంధాలు, యువకుల పైశాచికత్వంతో దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో ఘటనే రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల స్థలాల మధ్య జరిగిన వివాదం మహిళ దారుణ హత్యకు దారి తీసింది. గుర్తు తెలియని కొందరు దుండగులు.. స్థానికంగా ఉంటున్న ఓ మహిళను హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలం పరిసరాల్లో సీసీ పుటేజ్ ఆధారంగా.. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. మహిళపై మొదట అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి నిప్పు అంటించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయింది. మహిళ హత్యకు ఇళ్ల స్థలాలే కారణంగా తెలుస్తోంది. ఘటనాస్థలిని శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ పరిశీలించారు.
“ఇవాళ ఉదయం మాకు సాయి ఎన్క్లేవ్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఇక్కడ ఓ మహిళ మృతదేహం కాలిపోయి కనిపించింది అని. వెంటనే మేం ఇక్కడికి చేరుకున్నాం. వచ్చి చూస్తే కాలిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. అది ఎవరిదో ఇంకా తేలలేదు. కానీ మహిళ అని మాత్రం గుర్తించగలిగాం. చుట్టుపక్కల వాళ్లను ఆరా తీస్తే.. ఇళ్ల స్థలాల మధ్య వివాదమే ఈ మహిళ హత్యకు దారి తీసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఒకవేళ మహిళపై అత్యాచారం వంటి అఘాయిత్యానికి ఏమైనా పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికులను, బంధువులను ఆరా తీస్తున్నాం. సీసీఫుటేజ్ పరిశీలిస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం.” – శ్రీనివాసులు, శంషాబాద్ సీఐ