చంద్రబాబుపై కేసు నూటికి లక్ష శాతం కక్ష సాధింపేనని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో కలిసి చంద్రబాబును ములాకత్ అయిన అచ్చెన్నాయుడు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. సంబంధం లేని కేసులో చంద్రబాబును ఇరికించారు. కేసుకు సంబంధించి కనీస ఆధారాలు కూడా లేకుండా తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. ఇటువంటి కేసుకు భారతదేశ ప్రజాస్వామ్యక వ్యవస్థలో ఎప్పుడు చూసి ఉండరన్న ఆయన.. కేసు కట్టాలంటే ఆధారంగా కనీసం చిన్న క్లూ ఉండాలి.. కానీ, ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నారు. ఇవాళ్టికి 16 రోజులైంది ఎక్కడ చిన్న ఆధారం కూడా చూపించలేని పరిస్థితిలో ఉన్నారని.. ప్రభుత్వం వాస్తవాలు ప్రజానీకానికి చెప్పటం లేదు.. బయటకు చెప్పాలనుకున్న విషయాలు సెలెక్ట్ చేసి వాటిని మాత్రమే బయటికి చెపుతున్నారని మండిపడ్డారు.
రెండు రోజులు సీఐడీ కస్టడీకి తీసుకున్నారు మొన్న 11 ప్రశ్నలు, నిన్న 22 ప్రశ్నలు.. మొత్తం 33 ప్రశ్నలు రెండు రోజుల్లో చంద్రబాబును అడిగారు. ఈ కేసుకు సంబంధించి డబ్బుల మళ్లింపు, ఎవరి అకౌంట్ కి అయినా చేరుకుందా.. కనీసం పార్టీకి అయినా అన్న విషయాల్లో ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు విమర్శించారు అచ్చెన్నాయుడు. సీఐడీ విచారణలో అధికారులు సంబంధం లేని ప్రశ్నలు చంద్రబాబు ను అడిగరన్న ఆయన.. వారు అడిగిన 33 ప్రశ్నలకు ప్రతి ఒక్కదానికి రేపు మేం సమాధానం ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజా శ్రేయస్సుకోసం లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు ఖర్చు పెట్టారు.. కేవలం 331 కోట్లు ఖర్చు పెట్టారంటూ ఆరోపణలు చేసి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్ర, తెలంగాణ తో పాటు 70 దేశాల్లో చదువుకున్న ఉద్యోగాలు చేస్తున్న యువత చంద్రబాబు వెంట ఉన్నారు.. వీరంతా రాజమండ్రి వచ్చి ఒకసారి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి రావాలనుకున్నారని తెలిపారు అచ్చెన్నాయుఆడు.. మరోవైపు.. న్యాయం తప్పనిసరిగా గెలుస్తుందని.. 400 పేజీలు రిమాండ్ రిపోర్టు కూడా ఏసీబీ కోర్టు మా లాయర్ కు అందజేయనుంది. వాటి వివరాలు కూడా వెల్లడిస్తాం అన్నారు. చంద్రబాబు ధైర్యంగా పోరాట పటిమ తో ఉన్నారు.. ఆయన సలహాలు సూచనలు మేరకే ముందుకు వెళ్తాం అని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుంది.. కానీ, భద్రతపై అనుమానాలు ఉన్నాయన్నారు. పరిసరాలు బాగోలేదు దోమలు విపరీతంగా ఉన్నాయి.. జైలు అధికారులు పూర్తిస్థాయిలో నిబంధన అమలు చేస్తున్నారు వారిపై కూడా నిఘా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక, యువ గళం పాదయాత్ర వచ్చేవారం నుండి ప్రారంభమవుతుంది.. గ్రామస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చాం.. జనసేనతో కలిసి పనిచేయాలని తెలిపామన్నారు.
కేవలం శునకానందం పొందడానికే చంద్రబాబు విచారణ అని దుయ్యబట్టారు అచ్చెన్నాయుడు.. చంద్రబాబుపై కేసు పెట్టడం నూటికి లక్ష శాతం కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 30 ఎంక్వయిరీలు వేశారు.. ఒకటి నిరూపించ గలిగారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాం అన్నారు. మరోవైపు.. సంక్రాంతికే కాదు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు. దేశంలో ఏ సర్వే చూసినా తెలుగుదేశం పార్టీ వన్ సైడ్ గా గెలవబోతోంది.. రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ఒక చంద్రబాబే.. లోకేష్ ఢిల్లీ వెళ్లి ఇక్కడ వాస్తవాన్ని నేషనల్ మీడియాకు చెప్పారని తెలిపారు.