కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ అధ్యక్షులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసుల బిల్లు కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభతోపాటు, రాజ్యసభలోనూ వ్యతిరేకంగా ఓటు వేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలుపుతూ .. రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ.. ఆయనకు లేఖ కూడా రాశారు.
అరవింద్ కేజ్రీవాల్ తన లేఖలో ఢిల్లీ సర్వీసుల బిల్లును తిరస్కరించి.. వ్యతిరేకంగా ఓటు వేసినందుకు మీకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుకు ఢిల్లీలోని కోట్లాది ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ.. మీకు ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. ఢిల్లీ ప్రజల హక్కుల కోసం పార్లమెంటులో ఎంతో పోరాడుతున్నారని.. రాజ్యాంగం పట్ల మీకున్న విధేయత దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని.. రాజ్యాంగాన్ని అణగదొక్కే వారికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశ రాజధానిలోని పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కి అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కోరుతూ జాతీయ పార్టీలతోపాటు.. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతీయ పార్టీలను అరవింద్ కేజ్రీవాల్ మద్ధతు కోరిన విషయం తెలిసిందే. లోక్‌సభలో ఈ బిల్లు పొందిన తరువాత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 131 మంది ఓట్లు వేయగా, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. లోక్‌సభ, రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో రాష్ట్రపతి ఆమోదం లభించిన అనంతరం ఢిల్లీ సర్వీసెస్ బిల్లు కాస్త చట్టంగా మారిపోతుంది.