ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సినీ నటి రోజా భర్త ఆర్.కే. సెల్వమణిపై అరెస్టు వారంట్ జారీచేసింది. పరువు నష్టం కేసులో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని జార్జ్‌టౌన్ కోర్టు ఈ వారంట్ ఇచ్చింది. అయితే ఈ కేసుకు హాజరు కావాల్సిన సెల్వం ఏ మాత్రం స్పందించపోవడం గమహర్హం. అంతేకాకుండా ఆయన తరఫు న్యాయవాదులు కూడా కోర్టుకు సమాధానం ఇవ్వకపోవడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలో జార్జ్‌టౌన్ కోర్టు సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇప్పటివరకు ఈ విషయంలో మంత్రి రోజా బహిరంగంగా స్పందించలేదు. ఈ కేసు వేసిన ముకుంద్‌చంద్ బోత్రా అనే వ్యక్తి మృతిచెందగా.. అతడి కుమారుడు గగన్‌బోత్రా కేసును కొనసాగిస్తున్నారు.
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా భర్త సెల్వమణి పలు సినిమాలు డైరెక్ట్ చేశారు. అయితే 2016లో ఓ కేసులో ముకుంద్‌చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ అరెస్టు అవ్వడంతో ముకుంద్ కారణంగా తాను ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమణి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఇదివరకే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెల్వమణి చేసిన వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందని ముకుంద్ కేసు దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతున్న క్రమంలోనే ముకుంద్‌చంద్ బోత్రా కన్నుమూయగా.. ఆయన కుమారుడైన గగన్‌బోత్రా ఈ కేసును కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో కేసు విచారణ సోమవారం జరిగినప్పటికీ సెల్వమణి హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బోద్రా సెల్వమణితో పాటు అరుళ్ అనే మరో వ్యక్తిపై పరువు నష్టం దావా వేశారు.
అయితే రోజా భర్తగా మన తెలుగు వారు చెప్పుకున్నా..సెల్వమణి అంటే తమిళ సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు నమోదు చేశాయి. చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చిన నేపథ్యంలో సెల్వమణి తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం అదే. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో సెల్వమణి.. కోర్టుకు హాజరవుతారా? లేక న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయిస్తారా? అనేది చర్చనీయాంశమైంది.