స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు(A case of skill development scam)లో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Former CM Chandrababu)ను కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ ముగిసింది. వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు. చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (AAG Ponnavolu Sudhakar Reddy)వాదనలు వినిపించారు. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారన్నారు. ‘ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాలి. ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం ముఖ్యం. చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. స్కిల్ కేసులో నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉంది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది’’ అని సుధాకర్ రెడ్డి వాదించారు.
చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా(Siddharth Luthra), సిద్ధార్థ్ అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. చంద్రబాబును కోర్టులో హాజరుపరిచిన సెప్టెంబరు 10న సీఐడీ కస్టడీ కోరలేదని, మరుసటి రోజు సెప్టెంబరు 11న కస్టడీకి కోరుతూ మెమో ఎలా దాఖలు చేస్తారని కోర్టు దృష్టికి తెచ్చారు. 24 గంటల్లో దర్యాప్తు అధికారి నిర్ణయం మార్చుకున్నారని తెలిపారు. పాత అంశాలతో కస్టడీకి ఎలా కోరతారని ప్రశ్నించారు. అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు. చంద్రబాబు (Chandrababu) అవినీతి చేసినట్టు ఎక్కడా ఆధారాల్లేవని.. నాలుగేళ్లుగా ఎవరిని అరెస్టు చేసినా నిధుల దుర్వినియోగం పేరు చెబుతున్నారని పేర్కొన్నారు.
‘‘చంద్రబాబును అరెస్టు చేసి విచారణ పేరుతో సీఐడీ ఆఫీసులో ఉంచారు. కొన్ని గంటలపాటు చంద్రబాబును విచారించారు. ఆయన్నుంచి అన్ని విషయాలు రాబట్టామని చెప్పి, మళ్లీ కస్టడీకి ఎందుకు అడుగుతున్నారు. దర్యాప్తు విషయాలపై సీఐడీ మీడియా సమావేశాలు ఎలా పెడుతుంది’’ అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు.