తెలంగాణలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (PRC) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్‌గా ఎన్ శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్), సభ్యుడిగా బీ రామయ్య (రిటైర్డ్ ఐఏఎస్) సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanti Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఆరు నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. 5శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీని (PRC) నియమించాలని నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు(Chief Minister K Chandrasekhar Rao)కి టీెఎన్జీవోస్ కేంద్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ కమిటీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్(IAS N Sivashankar), సభ్యుడిగా రిటైర్డ్ ఐఏఎస్ బీ రామయ్యలను నియమించడంతోపాటు ఇంటెరిం రిలీఫ్ ప్రకటించినందుకు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మామిళ్ళ రాజేందర్, మారం జగదీశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రెండు పీఆర్సీలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే ఉందని మామిళ్ళ రాజేందర్, మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. వచ్చే పీఆర్సీలో కూడా ఉద్యోగుల ఆకాంక్షల మేరకు మంచి ఫిట్‌మెంట్‌తో నూతన వేతన సవరణ ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులంతా ప్రభుత్వ ఆకాంక్షల మేరకు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి మెరుగైన ఇంటరీమ్ రిలీఫ్ విడుదల చేయాలని, ఉద్యోగుల మిగతా సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతామని మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ తెలిపారు. ఆరోగ్య కార్డులు (ఈహెచ్ఎస్), కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, డీఏ తదితర పెండింగ్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామన్నారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకే మెరుగైన పీఆర్సీ ప్రకటించి, అన్ని సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.