తన రాజకీయ జీవితంపై ఏపీ రవాణాశాఖ మంత్రి మంత్రి పినిపే విశ్వరూప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంతోషంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతానని.. గౌరవానికి భంగం కలిగితే రాజకీయాన్ని వదులుకుంటానని అన్నారు. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కింద కూర్చోవడం, వేరొకరు నన్ను కింద కూర్చోబెట్టడం జరగలేదని స్పష్టం చేశారు. శుక్రవారం అమలాపురంలో సీఎం పర్యటన సందర్భంగా మహిళలతో సీఎం ఫొటోలు దిగిన వేదికపై మంత్రి మోకాళ్లపై కూర్చుండడంపై సాగిన ప్రచారం నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఎం పర్యటనలో భాగంలో ఫ్లెక్సీల వివాదమూ సృష్టించారని పేర్కొన్నారు. తనతోపాటు తన పెద్ద కుమారుడు కృష్ణారెడ్డి, రెండోవాడు శ్రీకాంత్ పేర్లతో అయిదేసి చొప్పున ఫ్లెక్సీలు వేయించామని, వాటన్నింటినీ తానే డిజైన్ చేయించానని అన్నారు.
కుమారుల ఫ్లెక్సీల్లో తన పేరు, తన ఫ్లెక్సీల్లో కుమారుల పేర్లు లేకుండానే వేయించామని.. దీని ఆసరాగా తీసుకుని కుటుంబంలో కలహాలున్నాయని ప్రచారం చేయడం బాధించిందని పేర్కొన్నారు. సీఎం సభా వేదికపై తాను మోకాళ్లపై కూర్చున్న తీరుపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. అది మహిళల కార్యక్రమం, ఎంపీ మహిళ అయినందున కుర్చీలో కూర్చున్నారని అన్నారు. తొలుత తాను బయట ఉన్నానని.. ముఖ్యమంత్రి పిలిస్తేనే వేదికపైకి వెళ్లానని తెలిపారు. వెనకనున్న మహిళలకు అడ్డుగా ఉండొద్దనే కారణంతోనే ఫొటో కోసం తాను మోకాళ్లపై కూర్చోవాల్సి వచ్చిందని వివరించారు. దళిత మంత్రిని అవమానించారని ప్రచారం చేయడం తగదన్నారు. స్థానిక నాయకుడు వాసంశెట్టి సత్యంను సీఎంకు కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పరిచయం చేయడంతో నెలకొన్న వివాదంపై స్పష్టతనివ్వాలని విలేకరులు కోరగా.. దీనిపై సత్యంనే ప్రశ్నించాలని వ్యాఖ్యానించారు.