విశాఖ పట్నంలోని రుషికొండ తవ్వకాలపై ఏదో ఒక అంశం ఎప్పుడు ముందు పడుతూనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశముపై సీఎం జగన్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రుషికొండపై నిర్మిస్తున్నది సచివాలయమేనని వైసీపీ తేల్చిచెప్పింది. రాష్ట్ర సచివాలయం కోసమే అక్కడ భవనాలు నిర్మిస్తున్నట్లు పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి శనివారం ట్వీట్ చేసింది. రుషికొండపై పర్యాటక ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, అక్కడ చేపడుతున్న నిర్మాణాలు ప్రభుత్వ కార్యాలయాల కోసం కాదంటూ ప్రభుత్వం ఇంతకాలం బుకాయిస్తూ వచ్చింది. అయితే అవన్నీ అబద్ధాలేనని తాజా ట్వీట్‌తో స్పష్టమౌతుంది. ‘ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్.. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి రుషికొండపై సచివాలయం నిర్మిస్తున్నారు. దానిపై కూడా టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఇది చూస్తుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం ఆ పార్టీకి ఇష్టం లేదనిపిస్తోంది’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది.
విశాఖ సుందర తీరం. పర్యాటక స్వర్గ ధామం. సాగర తీరంలో అనేక ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలోని విశాఖకి మొదటి నుంచీ మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ లేని వనరేముంది.. అన్నీ ఉన్నాయి. అయితే ఇదే కొందరికి కోట్ల రూపాయిల్లా కనిపిస్తోంది. విశాఖ కేంద్రంగా భూములను ఆక్రమించడానికి ఇదే సమయం అయిపోయింది. అందరూ విశాఖలోనే ఏదో చేయాలన్న తపన పెరిగిపోవడంతో.. కొందరు అధికార బలంతో ఇక్కడ భూముల్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతుంది రిషి కొండ. ఋషికొండ అని పిలుచుకునే ఇప్పుడు ఈ ఆక్రమణలు.. కూల్చడాల కారణంగా కళా వీహీనంగా మారిపోయింది. గత ప్రభుత్వాలు ఏదో కడితే.. ఇప్పటి ప్రభుత్వాలు అవి కూలుస్తాయి. ఇలా నిర్మాణ, కూల్చివేతల కారణంగా పాడైపోయిన పర్యాటక ప్రాంతంగా రుషి కొండ మారిపోయింది.
ఏ మూహూర్తాన అమరావతి వద్దని.. మూడు రాజధానులు అంటూ ప్రకటన వచ్చిందో..? అప్పటి నుంచే విశాఖలో కూల్చివేతలు ఆక్రమణలు జోరందుకున్నాయి. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత రాష్ట్రం నలుమూల నుంచీ.. ఇతర రాష్ట్రాల నుంచీ కూడా ఇక్కడికి వ్యాపారం చేద్దామని చాలా ముందే వచ్చారు. అయితే అలా వచ్చిన వారిలో భూముల మీద పెట్టుబడి పెట్టేవాళ్లే ఎక్కువయ్యారు. ఇంకో పక్క ప్రభుత్వ భూములు పై కన్నేసిన భూ మాఫియా కూడా ఎక్కువైంది. దీంతో ప్రభుత్వ స్థలాల పై ఎక్కువ ఆక్రమణలు.. కబ్జాలు పెరిగిపోయాయి.
రుషి కొండ ప్రాంతంలో ఒకప్పుడు ఏపీ టూరిజం సంబంధించిన భవనాలు ఉండేవి. హరిత రిసార్ట్స్ చాలా ప్రత్యేకమైనవిగా చెప్పాలి. అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఈ పర్యాటక భవంతుల్ని కూల్చేసింది. తిరిగి సెవెన్స్ స్టార్ హొటల్ కడతామని చెబుతున్నారు. కొత్త నిర్మాణాలు సంగతి సరే. కానీ.. కూల్చివేతల కారణంగా రుషికొండ కళా విహీనంగా మారింది. ఇకప్పుడు.. పర్యాటక భవంతులతో కళకళలాడిన ఈ ఇదే ప్రాంతం ఇప్పుడు కళ తప్పింది. ఇప్పుడు ఎలాంటి నిర్మాణాలు లేకుండా కొండ తొలిచేసి.. పచ్చని చెట్లను కూడా తొలగించారు. దీంతో స్థానికంగా ఉన్న ప్రతిపక్ష నేతలు కోర్టుల్ని ఆశ్రయించారు.