తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్టుకు నిరసనగా పలువురు ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీ (Car rally)చేపట్టారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం వరకు సంఘీభావ యాత్ర (Solidarity trip)నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు గచ్చిబౌలి, ఎస్ఆర్నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభించారు. దీంతో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కార్లలో వెళ్తున్న ఈ ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari)కి సంఘీభావం తెలపనున్నారు. ఈ విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్‌లోనూ నిఘా ఏర్పాటు చేశారు. ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు వెళుతున్న ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత అనుమతిస్తున్నారు. దేశ, విదేశాల్లోనూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. నిరసనలు, ర్యాలీలు కొనసాగిస్తున్నారు.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టు(Supreme Court)లో శనివారం పిటిషన్ దాఖలుచేశారు. ఆయన దాఖలుచేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో పలు విషయాలను ప్రస్తావించారు.
‘‘అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా పిటిషనర్‌కు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. 20 నెలల క్రితం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా అకస్మాత్తుగా, చట్టవిరుద్ధంగా అరెస్టుచేశారు. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోయినా రాజకీయ కారణాలతో అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా, దురుద్దేశపూర్వకంగా జరుగుతున్న దర్యాప్తుతో పిటిషనర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇప్పటివరకూ అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 17ఎ కింద చట్టబద్ధమైన అనుమతి తీసుకోనందున ఎఫ్‌ఐఆర్(FIR) నమోదుచేయడం, దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టడం చెల్లుబాటు కావు. సెక్షన్ 17ఎ కింద ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్టేట్ ఆఫ్ హరియాణా వర్సెస్ భజన్‌లాల్, యశ్వంత్‌సిన్హా వర్సెస్ సీబీఐ, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్‌మల్ చౌధరి కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. ఆ అనుమతి లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, అరెస్టు, రిమాండు, ఇతరత్రా చర్యలు తీసుకోవడం కానీ చేయకూడదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెక్షన్ 17ఎ కింద తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులను తప్పుగా అర్థం చేసుకొని దాని ప్రభావాన్ని నీరుగార్చింది.