ఏపీ ప్రభుత్వానికి హై- కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్ లో నిర్మాణాలను ఆపేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ పనులపై స్టే విధిస్తూ త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఈమేరకు ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్ లను విచారిస్తున్న జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది.
అమరావతి ఆర్-5 జోన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం యాజమాన్య హక్కులు లేని పత్రాలను పంపిణీ చేశారు. కోర్టు కేసులు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తేనే ఆ పట్టాలు చెల్లుతాయి. లేదంటే చెల్లవు. ఇప్పుడు యాజమాన్య హక్కులు లేని పట్టాలను ఇవ్వడం వల్ల పేదలకు కూడా పెద్దగా మేలు జరగదని విపక్షాలు అంటున్నాయి. పేదలకు ఇచ్చే స్థలాల్లో లక్షలు పోగు చేసుకుని అక్కడ వారు ఇళ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఇళ్లు కట్టుకున్న తర్వాత కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారి సొమ్ము మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుందని.. పట్టాల పంపిణీకి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని ఇళ్ల నిర్మాణానికి కాదని రైతులు వాదనతో ఇళ్ల పేరుతో జరుగుతున్న పనులను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.