ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission), చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు పాటించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు(TDP MLA Eluri Sambasivarao) దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది. ఓట్ల తొలగింపునకు అనుసరిస్తున్న విధానమేంటో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలంటూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. బాపట్ల జిల్లా పర్చూరు(Parchur) నియోజకవర్గ పరిధిలో భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు కోసం ఫారం-7 దరఖాస్తులు వచ్చాయని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైకోర్టులో పిటిషన్ వేశారు.
గంపగుత్తగా ఫారం 7 దాఖలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేలా జిల్లా ఎస్పీని ఆదేశించాలన్నారు. ఓట్ల తొలగింపు విషయంలో చట్ట నిబంధనలను పాటించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఓట్ల తొలగింపునకు పర్చూరు నియోజకవర్గ పరిధిలో మొత్తం 14వేల ఫారం-7 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందుకు బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సాంబశివరావు (Sambasivarao)తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓట్ల చేర్పులు, తీసివేత విషయంలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారన్నారు. ఓట్ల తొలగింపు విషయంలో నిర్దిష్ట విధానం ఉన్నా అధికారులు దానిని అనుసరించడం లేదన్నారు.
ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది సత్య శివదర్శిన్ వాదనలు వినిపిస్తూ.. ఒకే వ్యక్తి 6కన్నా ఎక్కువ ఫారం 7 దాఖలు చేస్తే వాటిని పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీ (A three-member committee)ఏర్పాటు చేశామన్నారు. ఆటోమేటిక్‌గా ఓట్ల తొలగింపు ఉండదని చెప్పారు. సంబంధిత ఓటరుకు నోటీసిచ్చి వివరణ తీసుకుంటామన్నారు. తప్పుడు ఫారం 7 దాఖలు చేసిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆదేశాలిచ్చామని, కొన్ని చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని కోర్టుకు చెప్పారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది.