ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది.. దాదాపు మూడున్నర గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ సీఆర్‌డీఏ పరిధిలోని ఆర్5 జోన్‌లో 47 వేల ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. అసైన్డ్, లంక భూములపై హక్కులు కల్పించేలా ఆమోదం తెలిపింది మంత్రి మండలి.. ఇక, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన 22(A) లో ఉన్న భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగింపుకు ఆమోద ముద్ర పడింది.
శ్రీకాకుళం జిల్లా భావనపాడు – మూలపేట పోర్టు నిర్మాణం కోసం రూ.3,880 కోట్లు రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంక భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. యూనివర్సిటీల్లో శాశ్వత అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ఆమోద ముద్ర వేసింది మంత్రి మండలి.. మరోవైపు.. ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంపెడ్ స్తోరేజీ ప్రాజెక్టుకి ఆమోదం. టిడ్కో కాలనీల్లోని 260 ఎకరాలను విక్రయించడంతో పాటు హడ్కో నుంచి రూ.750 కోట్లు రుణంగా తీసుకునే ప్రతిపాదనకు అనుమతి. గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.454 కోట్ల పరిహారం ప్యాకేజీ మంజూరుకు ఆమోదం తెలిపింది.
అజెండా అంశాలపై చర్చ అనంతరం మంత్రులతో రాజకీయ అంశాలపై కూడా సీఎం వైఎస్ జగన్ చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఇక, జగనన్న సురక్ష అమలుపైనా కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందట.. అద్భుతమైన ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నారు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అంటూ.. వారిపై ప్రశంసలు కురిపిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.