ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(BJP) కోర్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలుగు దేశం పార్టీ(TDP)తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పొత్తు పెట్టుకుంటానన్న ప్రకటనపై బీజేపీ కోర్ కమిటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. జనసేనతో పొత్తులపై ఈ సమావేశంలో కీలక ప్రస్తావన వచ్చే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu) అరెస్ట్ వెనుక బీజేపీ పార్టీ ఉందనే ప్రచారంపై కూడా ఈ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు హాజరు కానున్నారు.
ఇప్పటికే ఏపీ సహా ఇన్ఛార్జ్ పదవి నుంచి సునీల్ దేవధర్(Sunil Devdhar) ను బీజేపీ హైకమాండ్ తప్పించింది. పార్టీ ప్రొటోకాల్ ప్రకారం తనకు అప్పగించిన వాహానాలను సునీల్ దేవధర్ పార్టీకి హ్యండోవర్ చేశారు. ఇక, బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో జనసేన-బీజేపీ పొత్తుపై ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించడంతో ఏపీలో ఎన్నికల్లో ముందుకు వెళ్లాలి అనే దానిపై ముఖ్య చర్చ జరుగనుంది. దీంతో బీజేపీ కోర్ కమిటీలో కమలం పార్టీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేదానిపై ఆసక్తి నెలకొంది.