ప్రభుత్వాలు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసిన ర్యాగింగ్ భూతానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ర్యాగింగ్ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలతోపాటు ఐఐటీలు, ఎన్ఐటీల్లో జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కమిటీలను ఏర్పాటు చేసి.. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చబుతున్నా ర్యాగింగ్ ఆగడం లేదు. ర్యాగింగ్ మూలంగా జరిగే మరణాలు ఆగడం లేదు. తాజాగా పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పుర్ యూనివర్సిటీలో జరిగింది. తనకు చాలా భయం వేస్తోందని.. త్వరగా రావాలని వాళ్ల అమ్మకు ఫోన్ చేసిన విద్యార్థి గంటలోనే మరణించడంతో ఆ తల్లి గర్భశోకం చెప్పనలవి కాకుండా పోయింది.
కోల్‌కతాలోని జాదవ్‌పుర్ యూనివర్సిటీకి చెందిన 18 ఏళ్ల విద్యార్థి స్వప్నదీప్ తాను మృతి చెందడానికి గంట క్రితం తన తల్లికి ఫోన్ తనకు చాలా భయమేస్తోందని.. త్వరగా రావాలని ఫోన్లో చెప్పాడు. తాను వస్తున్నట్టు తల్లి చెప్పింది. బుధవారం రాత్రి స్వప్నదీప్ వాళ్ల అమ్మకు ఫోన్ చేసి మాట్లాడాడు. కళాశాలకు దాదాపు 100కి.మీ దూరంలోని నదియాలో వాళ్ల అమ్మానాన్న ఉంటారు. ‘అమ్మా నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ నా పరిస్థితి ఏం బాగోలేదు. నువ్వు తొందరగా రావా.. నీతో మాట్లాడాలని వాళ్ల అమ్మకు చెప్పాడు. వాళ్ల అమ్మ బయల్దేరుతున్నానని చెప్పింది. అయితే కొద్ది సేపటి తర్వాత ఆమె తిరిగి తన కొడుకుకు కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. గంట తర్వాత మీ అబ్బాయి హాస్టల్ బాల్కనీ నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే రండి అంటూ ఎవరో ఫోన్ చేసి చెప్పారని మృతుడి బంధువు ఒకరు మీడియాకు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి హాస్టల్లోని రెండో అంతస్తు నుంచి కిందపడి తీవ్ర గాయాల పాలైన కొన ఊపిరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయాడు.