Monday, December 23, 2024
Home ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీకి మరో ప్రతిష్టాత్మక ‘జైవిక్‌ ఇండియా అవార్డు’

Andhra Pradesh: ఏపీకి మరో ప్రతిష్టాత్మక ‘జైవిక్‌ ఇండియా అవార్డు’

by స్వేచ్ఛ
0 comment 72 views
Jaivik India Award

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు జైవిక్‌ ఇండియా అవార్డు ఏపీని ముద్దాడింది. ఈ మేరకు ఇంటర్నేషనల్‌ కాంపిటెన్స్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ (ఐసీసీవోఏ) సంస్థ 2023కి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి జైవిక్‌ ఇండియా అవార్డును ప్రకటించింది. జాతీయ స్థాయిలో 10 విభాగాల్లో 51 అవార్డులను వెల్లడించగా.. ఇందులో రాష్ట్రానికి 3 అవార్డులు దక్కడం విశేషంగా చెప్పవచ్చు.

పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరుకు చెందిన అత్తలూరుపాలెం ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎఫ్‌పీవో)తో పాటు బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం చిమటావారిపాలెంకు చెందిన గనిమిశెట్టి పద్మజ కూడా జైవిక్‌ ఇండియా అవార్డులకు ఎంపికయ్యారు. వీటిని సెప్టెంబర్‌ 7న ఢిల్లీలో జరిగే ‘బయోఫాక్‌ ఇండియా నేచురల్స్‌ ఎక్స్‌ పో’లో ప్రదానం చేయనున్నారు. కాగా రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా సాగుతోంది. 700 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం పుష్క­లంగా లభిస్తోంది. దీంతో ప్రకృతి సాగు ప్రస్తుతం 3,730 పంచాయతీల పరిధిలో విస్తరించింది. 9.40 లక్షల ఎకరాల్లో 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములవు­తున్నారు. ప్రకృతి, సేంద్రియ సాగులను ప్రోత్సహించేందుకు ఏపీ సీడ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ప్రస్తుత సీజన్‌ నుంచే గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌ (జీఏపీ) సర్టిఫికేషన్‌ జారీ చేయనుంది.

రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీవో) కేటగిరీలో పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరుకు చెందిన ‘అత్తలూరుపాలెం ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎఫ్‌పీవో)’కు జైవిక్‌ ఇండియా అవార్డు దక్కింది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేయడంలో ప్రావీణ్యం సంపాదించిన ఈ ఎఫ్‌పీవో పరిధిలో 400 మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ గ్రామాల పరిధిలో ఇతర రైతులకు అవసరమయ్యే జీవ ఎరువులను అందజేస్తున్నారు. అంతేకాకుండా వారు పండించిన కూరగాయలు, అపరాలు, చిరు ధాన్యాలు, బియ్యం, వంట నూనె­లు, పొడులు, పచ్చళ్లను మార్కెటింగ్‌ చేస్తున్నారు. అలాగే 70 దేశీ ఆవులతో ప్రత్యేకంగా ఆవుల పెంపకం కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆవు పాలు, నెయ్యి, మజ్జిగలను కూడా మార్కెటింగ్‌ చేస్తున్నారు. రైతులు మార్కెట్‌ ధర కంటే అధిక ఆదాయం పొందేలా ఎఫ్‌పీవో కృషి చేస్తోంది. అంతేకాకుండా ప్రకృతి సాగు చేసే రైతులకు అవసర­మయ్యే శిక్షణ కూడా అందిస్తోంది. అలాగే ఆర్గానిక్‌ ఫుడ్స్‌ పేరుతో గుంటూరు విద్యానగర్‌లో హోటల్‌ను సైతం నడుపుతోంది. గుంటూరు, విజయవాడల్లో ప్రత్యేక స్టోర్‌ల ద్వారా ఆర్గానిక్‌ ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News