కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేసే పోలీసులపై అనుచిత, అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు మన్నె రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వన్ టౌన్ సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మన్నె రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా పోలీసుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం దారుణమని అన్నారు. అధికారంలోకి రాగానే గుడ్డలూడదీస్తాం, అసలు, మిత్తితో అంతా బయటకు తీస్తామని వ్యాఖ్యానించడం ఏమాత్రం సరి కాదన్నారు.
ఇదిలా ఉంటే.. మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల అసోసియేషన్‌లు ఖండిస్తున్నాయి. ఆగస్టు 14న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లా పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కడిని గుడ్డలూడదీసి కొడతామని హెచ్చరించారు. కొంత మంది పోలీసుల పేర్లను డైరీలో రాసి పెట్టుకుంటున్నానని, అధికారంలోకి వచ్చాక వాళ్ల పనిచెబుతామని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.