బాలలను తీర్చిదిద్ది పౌరులుగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులది. ప్రభుత్వం సహకరిస్తే ఉపాధ్యాయులు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని.. విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసి ఖండాలు దాటించగలరని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్(The White House) లోపల అడుగుపెట్టారు. వివరాలలోకి వెళ్తే.. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు రాష్ట్రంలో సంక్షేమ పథకాల నుండి లబ్ది పొందుతున్న వారు చెప్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 మంది పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను(Students) బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రభుత్వం(AP government)ఎంపిక చేసింది.
కాగా విద్యార్థుల బృందం ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్(Fusayala Ratnakar) పర్యవేక్షణలో ఈనెల 14న అమెరికాకు వెళ్ళింది. ఐక్యరాజ్య సమితిలో ఎస్డీజీ సదస్సుకు వెళ్లారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. ఈ నేపథ్యంలో బుధవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను కూడా సందర్శించారు. వైట్‌హౌస్ బయట ప్రాంతాలను చూసేందుకు మాత్రమే ఆ దేశం అధికారులు అనుమతిని ఇస్తారు. అయితే మొదటిసారిగా మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవనం లోపలి ప్రదేశాలను సందర్శించేందుకు అవకాశం కలిపించారు. వైట్ హౌస్(The White House) భద్రత సిబ్బంది దగ్గర ఉండి వైట్ హౌస్ మొత్తం తిప్పి చూపించారు. భవనంలో ప్రతి ఒక్క విభాగం పనితీరును విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. అన్ని సందర్శించిన విద్యార్థులు తిరిగి స్వదేశానికి పయనమైయ్యారు. కాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.