వెయిట్ లిఫ్టింగ్ లో ఓ బాలిక అందరి చేత శభాష్ అనిపించుకుంది. 8 ఏళ్ల వయసులో 62 కేజీల బరువెత్తి ప్రపంచ రికార్డు సృష్టించింది. ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షోలో 30 సెకన్లలో 17 సార్లు క్లీన్ అండ్ జర్క్ వెయిట్ లిఫ్టింగ్ చేసి అప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. దీంతో చిన్న వయసులోనే శక్తికి మించిన సాహసాలు చేస్తూ ఔరా అనిపిస్తోన్న హరియాణాకు చెందిన అశ్రియా గోస్వామిని అందరూ ప్రశంసిస్తున్నారు. అశ్రియా గోస్వామి పంచకుల జిల్లాకు చెందిన చిన్నారి. ఆమె తల్లిదండ్రులు హన్ని, అవినాష్ కుమార్. వీరు సెక్టార్ 29లో నివాసం ఉంటున్నారు. అవినాష్ కుమార్ స్థానికంగా ఓ జిమ్ సెంటర్ నడుపుతున్నాడు. అశ్రియా బ్రైట్ స్కూల్లో చదువుకుంటోంది. మొదట్లో తన తండ్రి దగ్గరే వెయిట్ లిఫ్టింగ్ ట్రైయిన్ తీసుకునేది అశ్రియా. తండ్రితో పాటే జిమ్‌కు వెళ్లి.. బరువులు ఎత్తడం సాధన చేసేది. ఆమెలోని శక్తిని గుర్తించిన తండ్రి అవినాష్.. కూతురిని వెయిట్ లిఫ్టింగ్ వైపుగా ప్రోత్సహించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ గుర్మెల్ సింగ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది చిన్నారి.
ఇటీవల జులైలో జరిగిన ప్రముఖ టీవీ షో కార్యక్రమం.. ‘ఇండియాస్ గాట్ టాలెంట్’షోలో 62 కేజీల బరువును ఎత్తి రికార్డు సృష్టించింది అశ్రియా. 30 సెకన్లలో 17 సార్లు క్లీన్ అండ్ జర్క్ చేసి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. అంతకుముందు ఈ రికార్డ్.. 30 సెకన్లలో 16 సార్లు ఉండేది. స్నాచ్ వెయిట్ లిఫ్టింగ్‌లో 26 కేజీలు, స్కాట్ వెయిట్ లిఫ్టింగ్‌లో 47 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 32 కిలోల బరువులు ఎత్తి పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. భవిష్యత్తులో మరిన్ని రికార్డ్‌లు బ్రేక్ చేయడమే తన లక్ష్యమని అశ్రియా చెబుతోంది. అంతకుముందు ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు 45 కేజీల బరువెత్తి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 2022లో 35.8 కేజీల వెయిట్ లిఫ్టింగ్ చేసి.. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కైవసం చేసుకుంది.